తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తనపై వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. పని పాటలేకుండా టీడీపీ సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానెల్స్ తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాకు పారిపోవాల్సిన అవసరం గానీ, కర్మ గానీ పట్టలేదు. మా దేవినేని బ్లడ్‌లో ధైర్యం ఉంది” అని అవినాష్ అన్నారు.
గత రెండు నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు తన కార్యాలయంలో అందుబాటులో ఉన్నానని స్పష్టం చేశారు. కోర్టు తనను తప్పు చేసినట్లు తీర్పు ఇస్తే, దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తప్పుడు కేసులకు భయపడి పారిపోవడం తనకు అలవాటు లేదని, తన తండ్రి నెహ్రూ గారు ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పినట్లు తెలిపారు.
“టీడీపీ నేతలు, కార్యకర్తలు లాగా పారిపోవడం నా మనస్తత్వం కాదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తాను. వైసీపీ కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ పనిచేస్తాను” అని ఆయన తెలిపారు. పని లేకుండా టీడీపీ సోషల్ మీడియా చేసే ప్రచారాలను రాష్ట్ర ప్రజలు నమ్మవద్దని అవినాష్ సూచించారు.