భారత్ లో భారీగా పెరిగిన డీజిల్ ధర

రష్యా, యుక్రెయిన్ యుద్ధం ప్రభావం భారత్ పైనా పడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో భారత్ లోనూ డీజిల్ ధర పెరిగింది.డీజిల్ ధర లీటర్ కు రూ.25 పెరిగింది. అయితే పెట్రోల్ పంపుల దగ్గర కొనే సామాన్య పౌరులకు ఈ రేట్లు వర్తించవు. కేవలం టోకు విక్రయదారులకు (bulk users)కు విక్రయించే డీజిల్ పై మాత్రమే ధర పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు భారత్ లోని ప్రధాన చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

సాధారణంగా బల్క్‌ యూజర్లకు వర్తించే ధరలు రిటైల్‌ ధరలతో పోలిస్తే ఎక్కువ ఉంటాయి. ఈ అధిక ధర నుంచి తప్పించుకోవడానికి వారంతా పెట్రోల్‌ పంపుల వైపు మళ్లారు. మరోవైపు త్వరలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయని భారీ ఎత్తున ప్రచారం జరిగింది.

దీంతో సామాన్యులు సైతం కొనుగోళ్లను పెంచారు. ఫలితంగా ఈ నెల పెట్రోల్‌ పంపుల దగ్గర విక్రయాలు దాదాపు ఐదోవంతు పెరిగాయి. ఇది రిటైల్‌ విక్రయ సంస్థల నష్టాల పెరుగుదలకు దారితీసింది.

ముఖ్యంగా నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్‌ వంటి ప్రైవేటు రిటైల్‌ విక్రయ సంస్థలు భారీ నష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. గత 136 రోజులుగా ధరలు స్థిరంగా ఉండడంతో.. రాయితీ ధరకు చమురును పొందే ప్రభుత్వరంగ సంస్థలతో ఇవి పోటీపడలేకపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంపులను మూసివేయడం తప్ప మరోమార్గం ఉండదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

2008లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశవ్యాప్తంగా ఉన్న 1,432 పెట్రోల్‌ పంపులను మూసివేసిందని గుర్తుచేశాయి. ఇప్పుడూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని తెలిపాయి.

ఈ నేపథ్యంలోనే బల్క్ యూజర్లు పెట్రోల్‌ పంపుల వద్దకు వెళ్లకుండా నియంత్రించేందుకు ప్రత్యేకంగా వీరికి మాత్రమే ప్రభుత్వ రిటైల్‌ సంస్థలు ధరలను పెంచాయి. దీంతో ముంబైలో బల్క్‌ యూజర్లకు లీటర్ డీజిల్‌ ధర రూ.122.05కు చేరింది. అదే సామాన్యులకు మాత్రం ఈ ధర రూ.94.14గా కొనసాగుతోంది. ఢిల్లీలో ఈ రేట్లు వరుసగా రూ.115, రూ.86.67గా ఉన్నాయి.

రోజువారీ విధానంలో ధరలు పెంచిన భారత చమురు సంస్థలు నవంబర్ 4 తర్వాత ఇప్పటివరకు పెట్రో ధరలు పెంచలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు భయపడి కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చినా, ఆపై పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకుని చమురు ధరలపై ఎలాంటి ప్రకటన రాలేదు.

అయితే, రష్యా-యుక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 40 శాతం పెరిగింది. ఒక బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో భారత్ చమురు సంస్థలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్ టోకు ధర పెంచినా, రిటైల్ ధరలో మార్పేమీ లేదు.