Mahanaadu-Logo-PNG-Large

ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీలు వద్దు

– బొప్పరాజు, పలిశెట్టి

అమరావతి, మహానాడు: ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల బదిలీల నుంచి ఏడాదిలోపు రిటైర్‌ అయ్యే వారికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు విన్నవించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల ఉత్తర్వుల్లో/మార్గదర్శకాలలో ‘సంవత్సరం లోపు పదవీ విరామం(రిటైర్) పొందే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీల నుండి మినహాయింపు’ ఇవ్వలేదని తెలిపారు. దానివలన 62 ఏళ్ళ వయసులో అనేక శారీరక జబ్బులతో (షుగర్, బీపీ, హార్ట్ పేషంట్స్ మొ..) ఉంటారని, అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుండి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాలు ముందుగా తయారు చేసుకుని పెన్షన్ కొరకు పంపాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. అలాగే గతంలో 2016వ సంవత్సరంలో నాటి ప్రభుత్వం కూడా సంవత్సరం లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేస్తూ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను వారు మంగళవారం కలిసి వినతి పత్రాన్ని అందించారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్పందించి, ఒకట్రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారని ఏపీజేఏసీ ప్రతినిధులు వెల్లడించారు.