సినీ ఇండస్ట్రీలో ఒక్కప్పటి ఆలోచనలు ఇప్పుడు ఉండడం లేదు. జనరేషన్ మారింది. ఆలోచనా విధానం కూడా చాలా వరకు మారింది. అప్పట్లో నిర్మాతలు, హీరోలు ఎక్కడ సంపాదించామో ఆ డబ్బులు అక్కడే ఖర్చు పెట్టాల అనుకునేవారు ఇప్పుడు ఆ పాత చింతకాయ సామెత లేదు. విజయమో ఓటమో కోట్ల రూపాయల సొమ్ముని సినిమాల్లోనే పెట్టుబడిగా పెట్టేవారు. మురళీమోహన్, శోభన్ బాబు లాంటి స్టార్లు రియల్ ఎస్టేట్ లో అద్భుతాలు చేసిన దాఖలాలు లేకపోలేదు. అయితే ఇప్పటి కథానాయకుల శైలి దానికి భిన్నంగా కొత్తగా ఉంటోంది. మహేష్ బాబు మల్టీప్లెక్సు వ్యాపారంలో అడుగు పెట్టి సక్సెస్ సాధించాక అల్లు అర్జున్ అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ తో చేతులు కలిపి తన పేరు వచ్చేలా ఇదే బిజినెస్ స్ట్రాటజీ ఫాలో అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు బన్నీ ఈ బిజినెస్ ని వైజాగ్ కు విస్తరించబోతున్న వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. అయితే తండ్రి అల్లు అరవింద్ ఆలోచనా ధోరణికి మించి ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువనే తరహా లో అల్లు అర్జున్ చేసుకుంటున్న ప్లానింగ్ ఆశ్చర్యం కలిగించక మానదు. ఎందుకంటే బన్నీ మల్టీప్లెక్స్ కన్నా ముందు నెలల క్రితమే అల్లు స్టూడియోస్ నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే. దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్ లో చిరంజీవి, అల్లు అరవింద్ ఏనాడూ స్టూడియో ఆలోచన చేయలేదు. ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని ఇందులో సక్సెస్ సాధించినా మెగా, అల్లు కాంపౌండ్లు ఆ దిశగా చూడలేదు.
దానికి భిన్నంగా అల్లు అర్జున్ క్రమంగా వివిధ రకాల బిజినెస్ లను విస్తరించుకుంటూ పోవడం చూస్తే తన బ్రాండ్ ని ఎంత బలంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడితో అయిపోలేదు. క్రమంగా బెంగళూరు, విజయవాడ లాంటి నగరాల్లో మల్టీప్లెక్సులను నెలకొల్పి తద్వారా నెట్ వర్క్ ని పెంచుకునే పనిలో పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.