స్వరరాగ ప్రవాహం.. సర్వ దేవతల ఆవాహం!

నేడు బాలు పుట్టినరోజు
04.06.1946

నీ పాట
ఏడుకొండలలో
ప్రతిధ్వనించే
అన్నమయ్య కీర్తన..
నీవూ మావలె మనిషివని
నీకూ మరణం ఉన్నదని
తెలిసీ ఎలా బ్రతికేది..
అని నిలదీసి షిర్డీనాధుని
సమాధి నుంచి
ధుని సాక్షిగా వెలికి రప్పించిన
అపూర్వ ధ్వని..
జయజయ జయజయ వినాయక..
శ్రీ కాణిపాక స్వామికీ
ప్రియమైనదే నీ వాణి..
మాలధారణం..
నియమాల తోరణం..
అంటూ భక్తులకు..
అయ్యప్పకు చేశావు కదా అనుసంధానం..
స్వాముల మండల దీక్షకు
నీ పాటల కమండలమే
కదా రక్ష..
ఏమయ్యా ఓ రామయ్యా
ఎల్లా సేవించాలయ్యా..
ఇలా పాడితే
నార దుస్తులు కట్టిన
సీతాపతి
కంట ధార
రాదేమిటయ్యా..
బ్రహ్మమురారి
సురార్చిత లింగం..
గరళకంఠాన్నే మెప్పించలేదా
నీ సరళ కంఠం..
కదిలింది కరుణరధం
సాగింది క్షమాయుగం..
ఇలా ఏసు కోసమూ చేశావు
పాటల యాగం..
అల్లా అల్లా..
యా అల్లా అల్లా
అల్లానీ కదిలించలేదా నిలువెల్లా..
హరివిల్లు విరిచి
విరిజల్లు
కురిపించలేదా
నీ గళం..
ఇలా నీ పాటలతో
అయోధ్యను ఓలలాడించి..
కైలాసగిరిలో
హిమశిఖరాలను కరిగించలేదా..
నాడు ఘంటసాల
వాయిస్తే రుద్రవీణ..
కదిలించలేదా నీ గీతాలు
మా హృదయ వీణ..
అంతేనా..
నీ రూపము ఒక దీపము
అంటూ జాబిల్లిని వెలిగించావు
అమ్మ అన్నది
ఒక కమ్మని మాట..
అన్నది నీ గళం
నుంచి వెలువడిన
వజ్రాల మూట..
తల్లి ప్రేమకు సాక్షిగా
ప్రతి తెలుగు నోట
ఇదే పాట..
స్నేహబంధమూ
ఎంత మధురమూ..
స్నేహమేరా జీవితం
స్నేహమేరా శాశ్వతం..
ఈ పాటలేగా నిజమైన స్నేహానికి గురుతులు..
విని పరవశించిన అభిమానులేగా
నీ హితులు.. సన్నిహితులూ..!

పాటలతో పరమపదానికి వేసావయ్యా బాటలు..
అలా నీ భక్తి గీతాలతో
వెంకన్నను మెప్పించావు..
బాబాను మళ్లీ రప్పించావు..
అయ్యప్పను ఒప్పించావు..
ఈశుని కరిగించావు..
మమ్ము నీ స్వరానికి
దాసుల చేశావు..
ఆ దేవదేవుడు సర్వాంతర్యామి అయితే
నువ్వు స్వరాంతర్యామివి!

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286