ప్రేమ పేరుతో తేజస్వినిని మోసగించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు

– నిందితుడు సాదిక్‌పై 306, 376, 420 సెక్షన్ల కింద కేసులు
– ధర్మవరం డిఎస్పీ రమాకాంత్‌

ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని ధర్మవరం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమాకాంత్‌ మాట్లాడుతూ కేసును దిశ పోలీసులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. తేజస్విని మృతదేహానికి పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించామని ఆ నివేదిక ఆధారంగా నిందితుడిపై అదనంగా 376 అత్యాచారం సెక్షన్‌ను నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.

ప్రేమ పేరుతో తేజస్వినిని మోసగించి శారీరకంగా వాడుకున్న సాదిక్‌పై 420 సెక్షన్‌తో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించినందుకగాను 306 సెక్షన్ నమోదు చేశామని డీఎస్పీ రమాకాంత్‌ వివరించారు. నిందితుడిని కొత్తచెరువు సమీపంలో గోరంట్ల సీఐ జయ నాయక్ అరెస్టు చేశారని నిందితుల వద్ద నుంచి బైక్‌, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం కేసు విచారణను అనంతపురం దిశ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దిశ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వారాల్లో విచారణ ముగించి ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామన్నారు. నిందితుడికి శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పారు. సాదిక్‌ను కోర్టులో హాజరుపరచగా అతడికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.