నాకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది!

– మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు

అనంతపురం, మహానాడు: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది .. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటిదాకా పలుసార్లు నన్ను చంపేందుకు జేసీ ప్రయత్నించారు. మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో చంపారు. అదే పద్ధతిలో నన్ను హతమార్చేందుకు జేసీ కుట్రలు చేస్తున్నారు.

జేసీ గూండాలకు ఎస్పీ జగదీష్ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. నాపై ఇప్పుడు మూడు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలి. జేసీ ఆదేశాలతోనే నన్ను తాడిపత్రి కి ఎస్పీ అనుమతించటం లేదు, నాకు నా కుటుంబ సభ్యులకు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది, ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా నా ఇంటిపై దాడి జరిగింది. అక్రమ కేసుల్లో వేధిస్తున్నారు.. ఎస్పీ జగదీష్ సహకారంతోనే నన్ను చంపేందుకు జేసీ కుట్ర చేస్తున్నారు.