ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన  ఏ ఒక్క హామీ నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి – ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన  ఏ ఒక్క హామీ నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి
 -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదని   నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99.77 శాతం అమలు చేసినట్లుగా ఇప్పుడు అబద్దాలను ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు  మద్య నిషేధాన్ని అమలు చేస్తానని  జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. మద్య నిషేధం అమలు చేయకపోతే,  మళ్లీ ఓట్లు అడగబొమని  చెప్పారని  గుర్తు చేశారు.
  రచ్చబండ కార్యక్రమం లో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, మద్యం విక్రయాల ద్వారా  లభించే ఆదాయంపై అప్పులు చేశారన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు  గత ప్రభుత్వాల హయాంలో  26 మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేసేవారు.
వాటి ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎంతో మేలు చేకూరేది. గతంలో  లభించినట్లుగా ఇప్పుడు వారికి నేరుగా  రుణాలు అందడం లేదు. అలాగే  25 శాతం రాయితీలు దక్కడం లేదు. జగన్మోహన్ రెడ్డి  ఏదైతే చేయకుండానే చేశానని చెబుతున్నారో,  ఆ నిజాన్ని ప్రజలు గ్రహించారన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపా ఓటమికి  ఇది కూడా ఒక కారణమేనని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
 మూడింతలు  అధికంగా విద్యుత్ చార్జీలు చెల్లించాల్సిన దుస్థితి
 వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలను పెంచబోమని జగన్మోహన్ రెడ్డి  చెప్పినట్లుగా రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అయితే గతంలో 500 రూపాయల విద్యుత్ చార్జీలు చెల్లించేవారు ఇప్పుడు 1500 రూపాయలు, వెయ్యి రూపాయల విద్యుత్ చార్జీలు చెల్లించిన వారు 3 వేల రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఒక్కొక్క కుటుంబంపై  ఏడాదికి 15 వేల నుంచి 20 వేల వరకు విద్యుత్ చార్జీల భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిరోజు ఒక క్వార్టర్ సీసా మద్యం తాగే అలవాటు ఉన్న  కుటుంబంపై ఏడాదికి  60 నుంచి 65 వేల రూపాయల భారం పడుతోందన్నారు. ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది ఎంత?, తమపై పడిన భారం ఎంత అని ప్రజలు బేరిజు వేసుకుంటున్నారు. ప్రతి కుటుంబంపై  ఏడాదికి అదనంగా లక్ష రూపాయల భారం పడుతోందని తెలుసుకొని, ఈ నాలుగున్నర ఏళ్లలో  వచ్చిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ ప్రజలు గ్రహించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
 రానున్న ఎన్నికల్లో వైకాపా దారుణంగా ఓడిపోబోతుంది. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డే నని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఉద్యోగస్తులు, పారిశుద్ధ్య కార్మికులు, నిరుద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు  అందరూ గుర్రుగా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా వైకాపాకు ఓటు వేసే పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో తో సమానంగా వేతనాలు పెంచుతామని చెప్పారు. చెప్పింది ఏ ఒక్కటి చేయకపోనా, పత్రికల్లో మాత్రం ఆర్భాటపు ప్రకటనలతో ప్రచారం చేసుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు ధ్వజమెత్తారు.
 కేంద్ర ప్రభుత్వ పథకాలకు… రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కరింగ్
 కేంద్ర ప్రభుత్వ పథకాలకు, రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కరింగ్ వేసుకుని అదేదో తామే అమలు చేస్తున్నట్లుగా ప్రజలకు బిల్డప్ ఇస్తున్నారని  రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్భాటంగా సభలు, సమావేశాలను నిర్వహించి బటన్ నొక్కుతున్నానని చెప్పి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా, ఇప్పుడు ఇదంతా ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
 టిడిపి, జనసేన కూటమి 135 నుంచి 150 స్థానాలు గెలిచే ఛాన్స్
 రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన కూటమి కనీసం 135 నుంచి  150 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్టు రఘురామకృష్ణంరాజు తెలిపారు. తెదేపా, జనసేన కూటమి అద్భుత విజయాన్ని సాధించడం ఖాయమన్న ఆయన, నరసాపురం లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఏడింటిలో కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కొంత పుంజుకుంటుంది. నా ప్రస్తుత పార్టీకి అండగా ఉన్న సామాజిక వర్గం ఓట్లను, కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలను చేపట్టనున్న షర్మిల ఆమె భర్త ప్రభావితం చేయనున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపాకు మళ్ళిన ఓటు బ్యాంకు, తిరిగి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు చేసిన సర్వేలో తెదేపా, జనసేన కూటమి కనీసంగా  135 స్థానాలలో గెలుస్తుందని అంచనా వేయడం జరిగింది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత త్వరలోనే వెలువడనున్న సర్వేలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాయలసీమలోనూ వైకాపా ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ను జగన్మోహన్ రెడ్డి తన చెల్లి షర్మిల, బావ అనిల్ తో సహకారంతో గుంజుకున్నారు.  అదే చెల్లి, బావ ఆ ఓటు బ్యాంకు ని వెనక్కి లాగుకునే క్రమములో  వైకాపా అద్వితీయమైన పరాజయాన్ని మూటగట్టుకోనుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తెదేపా, జనసేన కూటమి విజయానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెద్ద కృషి చేస్తారో ,    ప్రస్తుత ప్రతిపక్ష పార్టీల కూటమి విజయానికి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి అంతే అధికమని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా  జగన్మోహన్ రెడ్డి నడిపించారని, నాలుగున్నర ఏళ్లుగా  విధ్వంసాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు, ఇప్పుడు అభివృద్ధిని చేయనున్న కూటమికి పట్టం కట్టాలని కోరుకుంటున్నారన్నారు..
 అన్ని రకాలుగా లబ్ధి పొందిన  వైకాపా ఎంపీ, ఆ పార్టీ కి రాజీనామా చేశారంటే…   వైకాపా  నిర్జీవం కానుందనేది స్పష్టమవుతోంది
 వైకాపాకు చెందిన ఒక ఎంపీ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరాలని భావిస్తున్నారు.  ఓటమి భయంతోనే, ఆయన వైకాపాకు రాజీనామా చేశారు. పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు చాలా ప్రాధాన్యం ఉన్న కమిటీలు. ఆ రెండు కమిటీలలో సభ్యుడిగా ఉన్న సదరు ఎంపీ, ఇంకొక కమిటీకి చైర్మన్ గా  కూడా వ్యవహరించారు. నాకు అదే కమిటీ చైర్మన్ గా బిజెపి నాయకత్వం అవకాశాన్ని కల్పించింది.
జగన్మోహన్ రెడ్డికి నాకు మధ్య ఇదే కమిటీ విషయంలో కొంతమంది కలతలు సృష్టించి నాకున్న పదవిని దూరం చేశారు. ఆ పదవిని చేపట్టిన వ్యక్తులే, ఇప్పుడు పార్టీని వదిలివేశారంటే,  దానికి కారణం ఓటమి భయమేనని రఘు రామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైకాపా దారుణంగా ఓడిపోబోతుందనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి నుంచి ఆర్థిక సహకారంతో పాటు ఎవరు పొందలేనంత లబ్ధిని పొంది కూడా, ఆయన కోటరీ లోని ప్రముఖ వ్యక్తి పార్టీ నుంచి బయటకు వచ్చారంటే, ఆ పార్టీ నిర్జీవం కాబోతుందని స్పష్టమవుతుంది
. శుక్రవారంనాడు పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి ద్వారా, ప్రజలకు చక్కటి  సందేశమే వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డికి ఇతరుల దగ్గర తీసుకోవడమే తప్ప, సహాయం చేసే గుణము లేదు. జగన్మోహన్ రెడ్డికి నేను సహాయపడ్డానే తప్పితే, ఆయన  నాకు ఏనాడుసహాయం చేయలేదు.
పార్టీ ద్వారా ఎన్నో పదవులు అనుభవించిన వారు కూడా అన్యాయం జరిగిందని సాకుతో  పార్టీని వీడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దూషించమన్నారని, దూషించడం ఇష్టం లేకనే  పార్టీని వీడుతున్నట్లుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
నేను చెప్పిన సర్వే అంచనాలు రానున్న ఎన్నికల్లో నిజమవబోతున్నాయనడానికి ఇటువంటి సంఘటనలే ఉదాహరణ అని రఘురామకృష్ణంరాజు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పోయి, అమరావతి రాజధానిని కొనసాగించే  మంచి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడనుందన్నారు.
తెదేపా, జనసేన కూటమితో బిజెపి కూడా  కలిసే ఎన్నికలకు వెళ్లనుందన్నారు. తెదేపా,  జనసేన కూటమితో బిజెపి కలుస్తుందనేది తన ఉద్దేశ్యంగా పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, తెదేపా, జనసేన కలిసి ఎన్నికలకు వెళతాయని అందరికంటే ముందు నేనే చెప్పానని గుర్తు చేశారు.
 టెలిఫోన్ లో అందరికీ అందుబాటులోనే ఉన్నా… ఎంపీ నిధులతో  అభివృద్ధి పనులు చేశా
 నరసాపురం నియోజకవర్గానికి రాలేని పరిస్థితులను  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించినప్పటికీ,   ప్రజలందరికీ టెలిఫోన్లో అందుబాటులోనే ఉన్నానని…  ఎంపీ నిధులతో నియోజకవర్గంలో  అభివృద్ధి పనులను చేశానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఏ గ్రామానికి ఏది కావాలన్నా ఎంపీ నిధులను మంజూరు చేసి, అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయడానికి కృషి చేశాను. ఆచంట, నరసాపురం నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు, ఎంపీ నిధులను ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేయకుండా, అడ్డుకున్నారు.
అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు అభివృద్ధి పనులకు తమ స్థాయిలో  ఆటంకాలను కలిగించలేదు. నరసాపురం, ఆచంట మినహా  మిగిలిన  అసెంబ్లీ నియోజకవర్గాలైన రాజోలు, ఉండి, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలో  ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేశాను. తణుకులో పూర్తిస్థాయిలో కాకపోయినా కొద్ది మేరకు  అభివృద్ధి పనులను చేయగలిగాను. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలలో ఎంపీ నిధుల ద్వారా  ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాను.
 ఆచంట నియోజకవర్గానికి ఎంపీ గా ఏమి చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే, స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పనులను చేయనివ్వలేదని సమాధానం చెబుతాను. నరసాపురం నియోజకవర్గ పరిధిలో ఓఎన్జిసి తో మాట్లాడి దాదాపు పది కోట్ల రూపాయలు మంజూరి చేయించాను. అయినా అభివృద్ధి పనులను జరగకుండా మోకాలు అడ్డారు. ఒక ఎంపీగా నిధులను తీసుకువచ్చి  ఇవ్వగలను. పనిచేయటం ఇష్టం లేని ఎమ్మెల్యేలున్న నిరంకుశ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతకంటే ఏం చేయగలమని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
రైల్వే శాఖ మంత్రి తో తనకున్న వ్యక్తిగత స్నేహం ద్వారా, నాలుగు అద్భుతమైన రైళ్లను తీసుకువచ్చాను. ఈనెల 12వ తేదీన ఒక రైలు ప్రారంభమైంది.  నర్సాపురం కేంద్రం నుంచి త్వరలోనే మిగిలిన రైళ్లు కూడా రాకపోకలను సాగిస్తాయి. నరసాపురం ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటి ఆరు నెలల పాటు, పార్లమెంట్ సమావేశాలు లేకపోతే… నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశాను.
విధి లేని పరిస్థితుల్లోనే ఢిల్లీలో ఉంటూ, టెలిఫోన్లో ఫోన్ లో ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ప్రజలకు ఏమైనా చేయాలంటేఈ బ్రహ్మ రాక్షసుల మధ్యన  బ్రతికి ఉండాలి కదా…అన్న రఘురామ కృష్ణంరాజు, ప్రతిరోజు మధ్యాహ్నం ప్రతి ఇంట్లో ఒక గంట సేపు, అలాగే వారంలో రెండు మూడు రోజులపాటు  ఏబీఎన్, టీవీ5 ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతో, అరాచకాలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి నన్ను హింసించి, నియోజకవర్గానికి రాకుండా చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు నేను తెలిసే అవకాశం ఏర్పడింది. లేకపోతే నా నియోజకవర్గానికి మాత్రమే నేను పరిమితం అయి ఉండేవాడిని. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే అవకాశాన్ని తన దృశ్చర్యల ద్వారా కలిగించిన  జగన్మోహన్ రెడ్డికి  ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు .
జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర ఒక విధంగా నాకు మేలే చేసింది. శారీరకంగా హింసించి, తప్పుడు కేసుల ద్వారా మానసికంగా ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రజలందరికీ చేరువ చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి థాంక్స్ చెబుతున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
 నరసాపురం నియోజకవర్గం నుంచి రచ్చబండ కార్యక్రమం
 నరసాపురం నియోజకవర్గం నుంచి తొలిసారిగా  రచ్చబండ కార్యక్రమాన్ని  రఘురామ కృష్ణంరాజు నిర్వహించారు.  ఢిల్లీలో  ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 99% అక్కడి నుంచే కొనసాగిస్తూ వచ్చారు.  అడపా, దడపా హైదరాబాదు నుంచి కూడా రఘురామ కృష్ణంరాజు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేవారు.
రచ్చబండ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు నరసాపురం నియోజకవర్గానికి రఘురామ కృష్ణంరాజు రాలేదు. తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన ఆయన రచ్చబండ కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు.
 దేశ చరిత్రలో ఏ ఎంపీకి కూడా ఇంతటి కష్టం రాలేదు
 దేశ చరిత్రలో ఏ ఎంపీ కి కూడా  ఇంత కష్టం రాలేదని రఘురామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నియోజకవర్గం  నుంచి  ఎంపీ గా ఎన్నికైన వారు ఎవరు కూడా ఇన్ని రోజులపాటు  నియోజకవర్గానికి రాకుండా ఉండలేదన్నారు. మొట్టమొదటి రచ్చబండ కార్యక్రమం నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాను.
ఈ పాలకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని విస్మరించి నియంతల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలోని ప్రాథమిక సూత్రాలను కూడా తుంగలో తొక్కుతున్నారు. 2020లో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు ఇచ్చిన భూములను విక్రయించాలని నిర్ణయించగా, నేను తీవ్రంగా వ్యతిరేకించాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేవాలయ భూముల విక్రయాన్ని వ్యతిరేకించిన వారే, అధికారంలోకి రాగానే  దేవాలయ భూముల విక్రయానికి జీవో జారీ చేశారు.
చివరకు గత్యంతరం లేక జీవోను ఉపసంహరించుకున్నప్పటికీ, నాపైకోపాన్ని పెంచుకున్నారు. ఇసుక విక్రయం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నేను తీవ్రంగా వ్యతిరేకించాను. గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే లారీ ఇసుక 12000 అంటే జనం గగ్గోలు పెట్టేవారు. అటువంటిది ఇసుక  ధర ను 40 వేల రూపాయలుగా నిర్ణయించి, అది కూడా సిఫార్సు చేసిన  అందుబాటులో లేని పరిస్థితిని తీసుకువచ్చారు. దీనితో భవన నిర్మాణ రంగం కుదేలయింది. భవన నిర్మాణరంగంపై ఆధారపడిన వారితో పాటు, దాని అనుబంధ రంగ కార్మికులు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది.
 రాష్ట్రంలో విరివిగా లభించే ఇసుకను పక్క రాష్ట్రాలలో అమ్ముకునే విధానాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించాను. దీనితో, ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చి… శాసన సభ్యులతో  తిట్టించి, నా దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతటితో ఆగకుండా,కులాల మధ్య, వర్గాల మధ్య వైషమ్యాలను  రెచ్చగొడుతున్నానని నాపై తప్పుడు కేసులను నమోదు చేశారు. నిన్ను ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆ రోజు నుంచి మొదలుకొని, ఏ రోజైనా నేను నియోజకవర్గానికి రావాలనుకుంటే నాపై మూడు నుంచి నాలుగు  పోలీసు స్టేషన్లలో తప్పుడు ఫిర్యాదులు చేసేవారు.
తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు అక్రమ కేసులు బనాయించేవారు. నియోజకవర్గానికి వస్తానంటే అరెస్టు చేస్తామని బెదిరింపులకు దిగేవారు. కరోనా  రెండవ దశలో వ్యాధి సోకి హైదరాబాదులో  చికిత్స పొంది, కోరుకుంటున్న తరుణంలో రాజ ద్రోహం కేసు పేరిట రాష్ట్ర పోలీసులు నన్ను నా ఇంట్లో నుంచి అపహరించి, లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు.
నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నప్పుడు తీసిన వీడియోను చూసి కొంతమంది ఆనందించారు. ఆనందించిన వారిలో  ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వారు ఉన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ తో సమావేశ అనంతరం తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా  ప్రస్తావించారు. కష్టకాలంలో ఆయన, నాకు అందించిన సహకారం మరువలేనిది. నన్ను ఆయన తన కుటుంబ సభ్యుడి మాదిరిగానే చూసుకున్నారు.
కష్టాలలో ఉన్నప్పుడే ఆత్మీయులు ఎవరో, ఆత్మబంధువు ఎవరో తెలిసేది. నాకు కష్టాలలో ఎంతో సహాయం చేసిన చంద్రబాబు నాయుడుకు నేను కృతజ్ఞుడినని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . అలాగే భీమవరం లోని నా ఇంటికి కూత వేటు దూరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కాగా, ఆ సమావేశానికి ప్రేక్షకుడి మాదిరిగానైనా హాజరవుదామని భావిస్తే…  నన్ను అడ్డుకోవడానికి అవసరమైతే రైల్వే బోగీని దగ్ధం చేయడానికి కూడా సిద్ధపడ్డారన్న సమాచారంతో వెనుతిరిగాను. నియోజకవర్గానికి నేను ఎందుకు రాలేదో మెజారిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం కాని వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా చెప్పాలన్నది నా ఉద్దేశ్యమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
 ఎంపీగా ఎన్నికైన తర్వాత సొంతూరికి రాలేకపోయా
 సంక్రాంతి పండుగకు  చిన్నతనం నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం వచ్చేవాడినని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కానీ ఎంపీగా ఎన్నికైన తర్వాత నా సొంత ఊరికి  రాలేని  పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు మా నానమ్మ  చనిపోతే కూడా  రాలేకపోయానన్న ఆయన, సంవత్సరికం కార్యక్రమానికి కూడా  దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు.
 ప్రజలకు అనుకున్నది చేయాలి అంటే నేను అంటూ బ్రతికి ఉండాలి కనుక, వీరు ఎంతకైనా తెగించే వ్యక్తులని తెలిసే సంయమనం పాటించాను. నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ, ప్రజలకు మాత్రం ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నానని రఘురామకృష్ణం రాజు మరోసారి పునరుద్గాటించారు.
 రాష్ట్ర ప్రభుత్వ సహకారలేమి వల్ల అనుకున్న పనులు చేయలేకపోయాను
 రాష్ట్ర ప్రభుత్వ సహకారలేమి అనుకున్నన్ని పనులను  చేయలేకపోయానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అయినా, ఇతర ఎంపీల కంటే  ఎక్కువగానే అభివృద్ధి పనులను చేశానని అన్నారు . రైల్వే  మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకొని నూతన రైల్వే లైన్లు, రైల్వే ఏర్పాటుకు  చొరవ తీసుకున్నాను. అలాగే షిప్పింగ్ హర్బర్ల అభివృద్ధి కోసం తగినన్ని నిధులు కేటాయించే విధంగా నా వంతు కృషి చేశాను..
కేంద్ర మంత్రులతో నాకు ఉన్న స్నేహ సంబంధాల వల్ల ఇంకా  రాష్ట్రానికి ఎక్కువ మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందలేదు. రాష్ట్రంలో నూతనంగా  కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కోసం చేతనైనంత కృషి చేస్తానని  రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
 అభ్యర్థులు దొరకతో ఫ్యామిలీ ప్యాకేజీ ఆఫర్లు
  రానున్న ఎన్నికల్లో వైకాపా నుంచి  పోటీ చేసే అభ్యర్థులు దొరకకపోవడం వల్ల  ఫ్యామిలీ ప్యాకేజ్ ఆఫర్లు  ప్రకటిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. సర్వేలో ఎమ్మెల్యేల పనితీరు బాగా రాలేదని మార్చడం హాస్యాస్పదంగా  ఉందన్నారు. తన వల్ల ఎదురయ్యే ఓటమిని పక్క వాడి పైకి తోసివేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని, అందుకే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని అభ్యర్థులను మారుస్తున్నారన్నారు.
ఒక ఎమ్మెల్యే న్యాయం చేయలేకపోయినా, అన్యాయం చేసేంత అపరిమితమైన అధికారాలు ఉంటాయా అని ప్రశ్నించారు. కొద్దిమంది శాసనసభ్యులకు మాత్రమే ఈ అపరిమితమైన అధికారాలు కట్టబెట్టారని వారిపై  ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న మాట నిజమేనని అన్నారు. మెజారిటీ శాసనసభ్యులపై కంటే, పార్టీ పైనే నెగిటివిటీ  ఎక్కువగా ఉందన్నారు. పార్టీపై ఉన్న నెగెటివిటీని  ఎమ్మెల్యేలపై ఉన్నట్లుగా చూపించడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు సంతృప్తి గానే భ్రమింప చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు.
 మా అధ్యక్షుడి మాటే  నా మాట
 నాలుగున్నర  ఏళ్ల పాటు ఏమి చేయకుండా, ఎన్నికలకు రెండు నెలల ముందు ఏదైనా చేస్తామని చెప్పే వారికి చిత్తశుద్ధి లేనట్టేనని  గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారని  రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ త్వరలోనే  డీఎస్సీ  నిర్వహిస్తామని చెప్పిన ప్రకటనపై స్పందించాలని  ఒక విలేకరి ఆయన్ని కోరగా… నేను ఇంకా వైకాపాలోనే ఉన్నానని గతంలో మా అధ్యక్షుడు చెప్పిన మాటే నా మాటని  ఎద్దేవా చేశారు.  రానున్న ఎన్నికల్లో తెదేపాతో కాంగ్రెస్ పార్టీ కలిసే అవకాశం లేదన్న, కూటమితో బిజెపి కలిసే అవకాశాలు ఉన్నాయని మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు..