జనసేన బన్నీ వాసు వాడుకుని మోసం చేశాడు

– జనసేన ఆఫీసుకొచ్చిన బాధిత మహిళ

అమరావతి: మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులపై గళమెత్తి సర్కారుపై గర్జించే జనసేనాధిపతి పవన్‌కల్యాణ్‌కు ఇదో సంకట వ్యవహారం. ఏపీలో మహిళలకు రక్షణ లేదంటూ విరుచుకుపడే ఆ పార్టీ నేతలకు సొంత పార్టీకి చెందిన మహిళ నుంచే.. తనను సొంత పార్టీ నేతనే వాడుకుని వదిలేశారని ఫిర్యాదు చేసిన ఇరకాటం. నిర్మాత, జనసేనలో చురుకుగా పనిచేస్తున్న ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు తనను నమ్మించి వాడుకుని మోసం చేశాడంటూ, సునీత అనే జనసేన వీరమహిళ అమరావతిలోని జససేన కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. తనకు జరిగిన అన్యాయాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ ఆఫీసుకు వచ్చానని సునీత చెప్పింది.

తాజా పరిణామాలు జనసేనను తొలిసారి రాజకీయంగా ఇరుకునపడేసేలా కనిపిస్తున్నాయి. మహిళ ఫిర్యాదు నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసును పార్టీ నుంచి బహిష్కరిస్తారా లేక ఇద్దరికీ రాజీ కుదిర్చి, తర్వాత చిన్న సమాచారలోపంతో జరిగిన ఘటనగా కథకు తెరదించుతారో చూడాలి. జనసేన తప్పుల కోసం ఎదురుచూస్తున్న వైసీపీ-వామపక్షాలకు ఆ పార్టీనే అస్త్రం ఇచ్చినట్టయింది.