-తెలంగాణపై కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా
– గతంలో సోనియా దయ వల్లే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్
– తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కుండబద్దలు కొట్టిన కేసీఆర్
– తెలంగాణ చరిత్రలో మొదటిపేజీ సోనియాదేనని స్పష్టీకరణ
– సోనియా చొరవ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఒప్పుకోలు
– చరిత్ర దాచినా దాగనిదని అసెంబ్లీలోనే చెప్పిన కేసీఆర్
– కాదన్నవారు మూర్ఖులేనని కేసీఆర్ వ్యాఖ్య
– ఎన్నికల ప్రచారంలో అందుకు భిన్నంగా కేటీఆర్ ప్రసంగం
– సోనియా వల్ల తెలంగాణ రాలేదని స్పష్టీకరణ
– బలిదానాలు, బెదిరిస్తేనే తెలంగాణ వచ్చిందన్న కేటీఆర్
– కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే వచ్చిందన్న వ్యాఖ్య
– కేసీఆర్-కేటీఆర్ ప్రసంగాల వీడియోలతో బీఆర్ఎస్ను ర్యాగింగ్ చేస్తున్న కాంగ్రెస్ సోషల్‌మీడియా
– పార్టీ పేరులో తెలంగాణ తీసేసిన పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్న కామెంట్లు
– సోనియా తెలంగాణ ఇవ్వకపోతే ఆమె ఇంటికెళ్లి గ్రూపు ఫొటోలెందుకు దిగారని ప్రశ్నల వర్షం
– పదేళ్ల తర్వాత ఇంకా తెలంగాణ ముచ్చట్లెందుకున్న ప్రశ్నలు
– 1200 మంది అమరుల్లో సగం మందినే ఎందుకు గుర్తించారని నిలదీత
– పదేళ్లలో చేసిన పని చెప్పుకుంటే మంచిదని హితవు
– సోషల్‌మీడియాలో హాట్‌హాట్‌గా కాంగ్రెస్ వీడియో
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికల సమయంలో చేసే ప్రచారం రాజకీయ పార్టీల కథ మార్చేస్తుంటుంది. ఏ చిన్న చాన్సు వచ్చినా దాన్ని ప్రత్యర్ధులు అంది పుచ్చుకుని, దానిని బ్రహ్మాస్త్రంలా సంధిస్తుంటారు. గత ఎన్నికల్లో టీడీపీ భుజంపై తెలంగాణ సెంటిమెంటును.. కాంగ్రెస్‌ను గురిచూసి కొట్టిన బీఆర్ఎస్కు, ఈసారి పెద్దగా అందివచ్చిన అస్త్రాలేమీ కనిపించటం లేదు.
ఆంధ్రాపార్టీ అని మరో సెటిమెంటు అస్త్రం సంధించేందుకు ఈసారి టీడీపీ కూడా బరిలో లేదు. దానితో షర్మిల-పవన్‌పై ఆంధ్రా సెంటిమెంటు సంధిస్తున్నా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. అటు అధికారంలోకి వచ్చిన పదేళ్ల తర్వాత, టీఆర్ఎస్ పేరులోని తెలంగాణ బదులు బీఆర్ఎస్ పేరు పెట్టుకోవడంతో బీజేపీ-కాంగ్రెస్ లాంటి పార్టీలు తెలంగాణ పేరు తీసేసిన పార్టీ ఇంకా తెలంగాణ సెంటిమెంటుతో బతుకుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
అయినా బీఆర్ఎస్ నాయకత్వం.. మళ్లీ జమ్మిచెట్టు నుంచి తెలంగాణ అస్త్రం దులిపి, ప్రత్యక్షంగా ప్రత్యర్ధులపై – పరోక్షంగా ఓటర్లపై సంధిస్తోంది. ఆమేరకు సెంటిమెంటు రాజేసే పని మొదలుపెట్టింది. అయితే అది తగలాల్సిన చోట తగిలే బదులు..చివరకు తమకే బెడిసికొట్టడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా ఆరకంగా, బీఆర్ఎస్ను ర్యాంగింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇంతకూ కథేమిటంటే… బీఆర్ఎస్ ఉత్తరాధికారి, మంత్రి కేటీఆర్ ఈమధ్య తన ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోనియమ్మ బలిదేవత అని ఆరోపిస్తున్నారు. అసలు తెలంగాణ తెచ్చింది సోనియా కాదు పొమ్మంటున్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టినందుకే, కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చిందని చెబుతున్నారు. ‘‘తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండవుతుంది. వీపు పగులుతుందని బెదిరిస్తే అప్పుడు తెలంగాణ ఇచ్చింద’’ని స్పష్టం చేస్తున్నారు.
‘‘1200 మంది పిల్లల ప్రాణాలు బలితీసుకున్న ఢిల్లీ దొర రాహుల్ తల్లి సొనియమ్మ. బలి దేవత సోనియమ్మ. బ్రిటీషు వాడొచ్చి నేనే నీకు సొసంత్రమిచ్చానంటే ఎట్లుంటది. సుర్రుమని కాలది?ఎడమకాలి చెప్పుతీసుకుని దవడ మీద కొట్టబుద్ది కాదు? ఇదిగో కాంగ్రెసోళ్లు చెబుతున్న తెలంగాణ కథ కూడా గట్లనే ఉంటద’’న్న ప్రచారంతో.. కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి సంధించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. తెలంగాణ కాంగ్రెస్ వల్ల రాలేదన్న కేటీఆర్ మాటలను వెక్కిరిస్తూ.. కేసీఆర్ నిండు అసెంబ్లీలో సోనియాను కీర్తిస్తూ చేసిన ప్రసంగం, ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను ఇప్పుడు బీఆర్ఎస్పై బ్రహ్మాస్త్రంలా సంధించడంతో, పాపం బీఆర్ఎస్ చేష్టలుడిగిపోవలసిన దుస్థితి.
ఆమేరకు 13మే 2014 నాటి అసెంబ్లీ సమావేశాల్లో.. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘సోనియాగాంధీ గారి చొరవతోనే తెలంగాణ సాకారమయింది. అందులో ఎటువంటి సందేహం లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. మళ్లీ 14 మార్చి 2015 నాటి సభలో అదే కేసీఆర్.. ‘‘ తెలంగాణ చరిత్ర ఎవరు రాసినా అందులో ఆమె పేరు తొలిపేజీలో రాస్తారు. అందులో అనుమానం లేదు. ఆమె ఆశీస్సులు, ప్రోత్సాహంతోనే తెలంగాణ వచ్చిన విషయాన్ని ఎవరూ కాదనరు అధ్యక్షా. చరిత్రను ఎవరూ తుడిచేయలేరు అధ్యక్షా. డెఫినెట్లీ సోనియాగాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది. బుద్ధి ఉన్న వాళ్లు, విజ్ఞత ఉన్నవాళ్లు దానిని అంగకీరిస్తారు. కాదంటే వాళ్లు మూర్ఖులవుతారు తప్ప, మంచివాళ్లు కారు’’ అని కుండబద్దలు కొట్టారు.
అయితే కేటీఆర్ ఈనెల 6న సోనియాను విమర్శిస్తున్న వీడియోను.. ఆనాడు కేసీఆర్ అదే సోనియమ్మను పొడుగుతూ నిండు సభలో చేసిన వ్యాఖ్యల వీడియోతో జతచేసి, సోషల్‌మీడియాను వదిలిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ను ఒక రేంజ్లో ర్యాగింగ్ చేస్తోంది. దానితో నెటిజన్లు బీఆర్ఎస్ను కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
సోనియాగాంధీ బలి దేవత, తెలంగాణ ఇవ్వకపోతే సకుటుంబసపరివారసమేతంగా సొనియా ఇంటికి ఎందకు వెళ్లినట్లు? 1200 మంది అమరులైతే అందులో మనం గుర్తించింది సగమే కదా సారూ? తెలంగాణ ఇయ్యవద్దనోళ్లకు మంత్రిపదవులిస్తిరి. రాయల్ తెలంగాణ కావాలన్నవాళ్లతో దోస్తానా చేయబట్టిరి? అసలు పార్టీ పేరులో తెలంగాణ తీసేసినోళ్లు తెలంగాణ గురించి మాట్లాడటం కంటే, ఈ పదేళ్లలో ఏం చేశారో చెప్పకుంటే నాలుగు ఓట్లయితే వస్తాయి కదా సారూ అని కామెంట్లు విసురుతుతున్నారు.
ఎన్నికల సమయంలో ఏదంటే అది మాట్లాడితే గమ్మునుండే కాలం కాదిది. పాత వీడియోలు ఆడియోలతో చెలరేగి, ఎదురుదాడి చేసే సోషల్‌మీడియా యుగమిది. అంటే మాటలే.. మాటలకు సమాధానాలిస్తాయన్నమాట! వింటున్రా సారూ?!