Mahanaadu-Logo-PNG-Large

‘ఉమ్మడి కృష్ణా’కు పెద్దపీట

– కొల్లు రవీంద్రకు గనులు మరియు భూగర్భ, ఎక్సైజ్ శాఖలు
– కేపీ సారథికి సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ
– గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కొల్లు
– వైఎస్ఆర్ మంత్రివర్గంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా వ్యవహరించిన సారథి
(రమణ)

ఉమ్మడి కృష్ణాజిల్లా నుండి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక శాఖలను కేటాయిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు.

గనులు మరియు భూగర్భజల శాఖతో పాటు ఎక్సైజ్ శాఖను రవీంద్రకు కేటాయించగా కొలుసు పార్థసారథికి సమాచార పౌర సంబంధాల శాఖతోపాటు గృహ నిర్మాణ శాఖను కేటాయించారు.

మొత్తం నాలుగు శాఖలు ఉమ్మడి కృష్ణాకు వచ్చాయి. కొల్లు రవీంద్ర గతంలో ఎక్సైజ్, బీసీ సంక్షేమ, క్రీడలు, న్యాయ శాఖతోపాటు మొత్తం ఆరు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. గతంలో నిర్వర్తించిన ఎక్సైజ్ శాఖను మళ్లీ రవీంద్రకు అప్పగించడం విశేషం.

ఇక కేపీ సారథి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా వ్యవహరించారు.ఈ ప్రభుత్వంలో ఆయనకు సమాచార పౌర సంబంధాల శాఖతోపాటు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చంద్రబాబు అవకాశం కల్పించారు.