మేరీమాత మహోత్సవం లో పాల్గొన్న నారా లోకేష్

  • బిసి నేత నాగేశ్వరరావుతో యువనేత భేటీ
  • మంగళగిరి అభివృద్ధికి సహకారం కోరిన లోకేష్
మంగళగిరి: తాడేపల్లి రూరల్ కుంచనపల్లి ఆర్ సిఎం అధ్వర్యంలో నిర్వహించిన మేరీమాత మహోత్సవాల్లో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. శనివారం సాయంత్రం కుంచనపల్లి గ్రామానికి వెళ్లిన లోకేష్ కు మతపెద్దలు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ప్రార్థనల్లో పాల్గొన్న లోకేష్ కు చర్చి ఫాదర్ ఆశీర్వచనం అందించారు. తర్వాత ఉండవల్లిలో ప్రముఖు బిసి నేత వల్లభాపురం నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రజకులు ఎదుర్కొంటున్న పలు వృత్తిపరమైన సమస్యలను నాగేశ్వరరావు యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు.
 లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పారు. గత టిడిపి ప్రభుత్వం రజకులతోపాటు ఇతర చేతివృత్తుల వారికోసం ఆదరణ పథకం ద్వారా 90శాతం సబ్సిడీతో పనిముట్లు అందించిందని గుర్తుచేశారు. ఇందుకోసం రూ.964 కోట్లు వెచ్చించామని చెప్పారు. ప్రభుత్వం మారే సమయంలో కొనుగోలుచేసిన పనిముట్లను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకుండా పాడుబెట్టిందని చెప్పారు.
టిడిపి-జనసేన ఆధ్వర్యంలో రాబోయే ప్రజాప్రభుత్వం రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. రజక వృత్తిపనిపై ఆధారపడిన వారి కోసం అత్యాధునిక సమీకృత దోబీఘాట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని, ఇందుకు మీవంతు సహాయ,సహకారాలు అందించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు.