మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వెయ్ దరువెయ్’ – నిర్మాత దేవరాజ్ పోతూరు

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దేవరాజ్ పోతూరు మీడియాతో మాట్లాడుతూ సినీ సంగతులను వివరించారు.

* మా సాయితేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మేం చేసిన రెండో సినిమాయే ‘వెయ్ దరువెయ్’. నవీన్ రెడ్డిగారు చెప్పిన కథ వినగానే బాగా నచ్చింది. ఆ సమయంలో రెండు విషయాలపై క్లారిటీగా ఉండాలనుకున్నాను. అందులో మొదటిది 35 రోజుల్లో సినిమాను పూర్తి చేయాలనేది. రెండో విషయం.. అందరూ ఆన్ టైమ్ సెట్స్‌లో ఉండేలా ముందుగానే మాట్లాడుకోవాలని అనుకున్నాను. అనుకున్నట్లే ముందుగానే నటీనటులందరితోనూ మాట్లాడుకున్నాను. ఓ పద్ధతి ప్రకారం సినిమాను పూర్తి చేసుకుంటూ వచ్చాం. దీంతో సినిమాను 35 రోజుల్లోనే కంప్లీట్ చేసేశాం. దీని వల్ల ప్రొడక్షన్ ఖర్చు తగ్గింది. ఇలా ప్లానింగ్ చేసుకోవటం వల్ల సినిమాను అనుకున్న బడ్జెట్‌లో పదిశాతం అటు ఇటుగానే పూర్తి చేశాం.

* నవీన్ రెడ్డిగారు కథ చెప్పినప్పుడు అందులో కామెడీ, సెంటిమెంట్ బాగా నచ్చింది. మూవీలో 80 శాతం కామెడీ ఉంటుంది. దీంతో పాటు తండ్రి, సోదరి భావోద్వేగం కూడా మిక్స్ అయ్యి రన్ అవుతుంటుంది. హీరోగా అనుకున్నప్పుడు సాయిరామ్ శంకర్‌గారినే ఫిక్స్ అయ్యాం. ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. సాయిరామ్‌గారు మాతో పాటు ట్రావెల్ అయ్యారు.

* ‘వెయ్ దరువెయ్’ అనేది మాస్ కామెడీ చిత్రం. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. మన సమాజంలో జరిగే అంశాలను తీసుకుని దాన్ని కమర్షియల్ యాంగిల్‌లో తీర్చిదిద్దాం. నిజ ఘటనలే ఆధారంగా తెరకెక్కించాం. కామారెడ్డిలో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి హీరో హైదరాబాద్ వస్తాడు. అక్కడ కథ ఎలా ఉంటుందనేదే సినిమా. ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే కథాంశంతో సినిమా ఉంటుంది.

* సినిమా రిలీజ్ కావటానికి కాస్త సమయం పట్టిన మాట నిజమే. అయితే అందుకు పరిస్థితులే కారణం. ముందుగా ఒకరు మా సినిమాను ఔట్ రేట్‌కు అడిగారు. కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. అవి చేయటానికి నాకు ఆర్టిస్టుల డేట్స్ దొరకలేదు. దాంతో షూటింగ్ కాస్త సాగుతూ వచ్చింది. అలా ఆలస్యమైందంతే.

* ఫస్ట్ కాపీ చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా ఔట్ అండ్ ఔట్ మూవీ. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. కథకు తగ్గట్టే టైటిల్ పెట్టాం. మాస్ కామెడీ మూవీ.

* సాయిరామ్ శంకర్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది. ఫిట్‌నెస్‌ను ఇప్పటికీ అలాగే మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన కమ్ బ్యాక్ అవుతారని నమ్మకం ఉంది.

* ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న భీమ్స్‌గారు మా సినిమాకు సంగీతాన్ని అందించారు. టెక్నికల్‌గా మంచి టీమ్ కుదిరింది. మంచి పాటలు సెట్ అయ్యాయి. అలాగే నటీనటుల విషయానికి వస్తే సీనియర్ ఆర్టిస్టులు నటించారు. అందువల్ల షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం పట్టలేదు.

* నెక్ట్స్ మూవీని కూడా లిమిటెడ్ బడ్జెట్‌లోనే చేస్తాను. నా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉండాలనే ఆలోచిస్తాను. అలాగే ప్లాన్ చేసుకుంటాను.