ఇది కథ కాదు..వ్యధ,!

రాస్తుంటే ఒక వ్యక్తి కథ అనిపించలేదు..సినిమా కథ..
కన్నీటి గాథ రాస్తున్న భావన..మన మహానటి సావిత్రి కథని తిరగరాస్తున్నట్టే..
అదే రూపం..
అదే అభినయం..
అదే ప్రతిభ..
అదే మార్ధవం..
మొత్తంగా మీనాకుమారి కథలో అంతులేని విషాదం..

గ్లిసరిన్ అవసరం లేకుండా ఎన్నో సినిమాల్లో కన్నీరు ఒలకబోసిన సామర్థ్యం..
తలచుకుంటే చాలు అందమైన
ఆ నయన ద్వయం
నుండి కన్నీటి జలపాతాలు..
హిందీ చిత్రపరిశ్రమను వసూళ్ల సునామీలో తడిపేసిన కన్నీటి ధారలు!

మీనాకుమారి..
అచ్చమైన అందానికి నిర్వచనం..
అపురూప అభినయానికి చిరునామా..
ఆమె కళ్ళు కన్నీటి వాకిళ్ళు..
దిలీప్ కుమార్ అంతటి నటుడే తన ముందు అభినయించడానికి
జంకేటంతటి అసమాన
ప్రతిభ..రాజ్ కుమార్ వంటి
అసమాన నటుడే ఆమె ఎదురుగా ఉంటే డైలాగులు మర్చిపోయిన దృష్టాంతాలు
ఎన్నో…మనం మహానటులని ఆరాధించే మహామహులు సైతం అమ్మో ..మీనాకుమారితోనా!
సినిమా ఒప్పుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి..ఇంకొందరు అలాంటి అద్భుతమైన అభినేత్రి పక్కన నటిస్తే చాలు తమ కెరియర్ సుసంపన్నం అయిపోతుందని ఆశపడి
అలాంటి అవకాశం కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురుచూసిన రోజులు..
అలా ఆమెతో నటించి ఎన్నో నేర్చుకున్న ఆనాటి కొత్త ముఖాలు..తర్వాత రోజుల్లో సూపర్ స్టార్లు అయిన రాజేంద్ర కుమార్..
ధర్మేంద్ర..సునీల్ దత్
వంటి వారున్నారు.
ధర్మేంద్ర అయితే పూర్తి స్థాయిలో మీనాకుమారి తీర్చిదిద్దిన ఆర్టిస్ట్..
ఆమె కొలువై ఉండే సెట్టు ఒక పాఠశాల..ఆమె వదనం కోటి భావాల  సదనం..ఒక్కోసారి అశోక్ కుమార్ స్క్రిప్టులో లేని కొన్ని డైలాగులు చెప్పు మీనాకుమారి అభినయ కౌశలాన్ని పరీక్షించే ప్రయత్నం చేసేవారట..ఆమె ఎంత మాత్రం తగ్గకుండా అందుకు సరిపోయే..సరితూగే కౌంటర్
డైలాగుని సంధించి అంతటి నటున్నీ చకితున్ని చేసేవారు.
ఇలాంటి పరీక్షలెన్నో..
సత్యజిత్ రే అంతటి దిగ్దర్శకుడే మీనాకుమారిని అనితరసాధ్యమైన అభినయ ప్రతిభ గల మహానటీమణిగా కొనియాడారు.నౌషాద్ అయితే హిందీ సినిమా ఎందరో గొప్ప కళాకారులను వెలుగులోకి తెచ్చి ఉండవచ్చు..కానీ మీనాకుమారి వంటి మరో నటి ఏనాటికీ రాదని అన్నారు. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మీనాకుమారిలా డైలాగులు చెప్పగలిగే నటి ఆమెకు ముందు గాని..ఆమె తరంలో గాని..ఇక ముందు ఎప్పటికీ గాని పుట్టదని కొనియాడారు.
ఆమె తరంలో అపూర్వంగా వెలిగిపోయిన మధుబాల..నర్గీస్ వంటి అభినేత్రులు కూడా మీనాకుమారి ప్రతిభకు ఫిదా అయిపోయిన వారే.ఆమె నటులను తయారు చేసేవారు..నటులను కుప్పకూల్చే వారు కూడా..
అదీ..ఆమె స్థాయి..
ఆమెతో పదమూడు సినిమాలు చేసిన అశోక్ కుమార్ ఇలా అన్నారు..
సినిమాలు ఎన్నుకునే ముందు మీనా చాలా ఆలోచిస్తుంది..ఒక్కసారి ఓకే అన్నాక ఇక ఆ పాత్ర జీవితం పొందినట్టే..నిర్మాత పంట పండినట్టే..!

బైజుబవ్రా.. ఫాకీజా..సాహెబ్ బీబీ ఔర్ గులాం..
మేరే అప్నే..పరిణీత..
దిల్ అప్నా ఔర్ ప్రీత్..
పరాయి..ఫుట్ పాత్…ఫూల్ ఔర్ పత్తర్..ఆజాద్..
కోహినూర్…ఇలాంటి ఎన్నో సూపర్ హిట్లు..వాటిలో కొన్ని కళాఖండాలు.. పాకీజా సినిమాలో అయితే ఆమెను తప్పించి మరొకరిని ఊహించలేనంత మహాభినయం..ఆమెతోనే
ఆ గొప్ప చిత్రానికి
పూర్తి న్యాయం..

ఫిలిం ఫేర్ అవార్డుల పరంపర..అంతులేని ప్రశంసలు..అనన్యసామాన్యమైన కీర్తిప్రతిష్టలు..తరిగిపోని సంపద..ఆ రోజుల్లో ఇంపాలా కారు కొన్న ఏకైక నటి..
నిద్ర పట్టడానికి మాత్ర బదులు ఒక పెగ్గు అనుకున్న పరిస్థితి నుంచి మద్యానికి
బానిస అయిపోయిన చీకటి యాత్ర…!

పాకీజా సూపర్ హిట్టు ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించే లోగానే కోమాలోకి..అటు నుంచి అటే ఈ సుందరి స్వర్గపురికి..
మరణించాక కూడా విడిచిపెట్టని అవార్డులు..ప్రశంసలు..
ఆమెతో పాటు తరలివెళ్లిపోయిన ఎన్నో చేదు జ్ఞాపకాలు..ఇక్కడే మిగిలిపోయిన ఎన్నెన్నో
తీపి గురుతులు..!
మహానటి మీనాకుమారి జ్ఞాపకాలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286