విజయవాడ వెటర్నరీ కాలనీలో కొత్త జిమ్ ప్రారంభం

-జిమ్ ను ప్రారంభించిన మంత్రి నారాయ‌ణ‌, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్

విజయవాడ: విజయవాడ వెటర్నరీ కాలనీలోని మున్సిపల్ పార్క్‌లో కొత్తగా నిర్మించిన జిమ్‌ను మంత్రి నారాయణ మరియు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పచ్చదనం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ ద్వారా పచ్చదనం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

పార్కులు, పచ్చదనం, వాకింగ్ ట్రాక్‌లు అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. వెటర్నరీ కాలనీలోని సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, అయితే నిధుల కొరత ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుండి 27 వేల కోట్లు కేటాయించినా గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో నిధులు విడుదల కాలేదని వివరించారు. స్వచ్ఛ భారత్ కింద 2021 లో 2980 కోట్లు విడుదలైనా రాష్ట్ర వాటా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సహకారంతో కేంద్రం నుండి రావాల్సిన నిధులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కేందుకు కొంత సమయం పడుతుందని అంచనా వేశారు.

సీఎఫ్ఎంఎస్‌లో ఉన్న 1900 మున్సిపాలిటీల నిధులు గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసిందని ఆరోపించారు. మున్సిపాలిటీల నిధులు వాటి అభివృద్ధికే వినియోగించునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని తెలిపారు.