భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 31న) ఉదయం శ్రీ వెంకయ్య నాయుడు నివాసం లో కలిసి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీ గా మరియు వివిధ శాఖల మంత్రి గా అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి గా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ఆయనదే మొదటి స్థానం. మన ఇంటి పెద్దగా ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణ్ రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీ కి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్నరావాలని, అదేవిధంగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా తెలియచేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే ఆ పురస్కారానికి పరిపూర్ణత ఉంటుందని నా అభిప్రాయం. అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు” అన్నారు.