రికార్డులు బద్దలు కొడతారా…పార్ట్‌2లను నమ్మొచ్చా?

బాలీవుడ్‌ ఈ మధ్య కాలంలో మంచి హిట్లే కొట్టింది. 2023 విడుదలైన దాదాపు చిత్రాలన్నీ కూడా హిట్‌ అయ్యాయి. ప‌ఠాన్, జ‌వాన్, స‌లార్ తో పాటు ప‌లు చిత్రాలు భారీ విజ‌యాల్ని న‌మోదు చేసాయి. ఇందులో సీక్వెల్ సినిమాలు మ‌రింత ఉత్కంఠ‌ను పెంచుతున్నాయి. ఈ సంవత్సరం దేశభక్తి డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్‌లు, రొమాంటిక్ కామెడీలు … ఊహాతీతం అనిపించే సైన్స్ ఫిక్షన్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న ప్ర‌భాస్ గ‌త ఏడాది స‌లార్ లాంటి భారీ చిత్రంతో అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది `కల్కి 2898 AD` పేరుతో మ‌రో సంచ‌ల‌నాన్ని సిద్ధం చేస్తున్నాడు. క‌ల్కి మే 9న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఏమిటో తెలుసుకోవాల‌న్న ఉత్సాహం ఫ్యాన్స్‌లో మాములుగా లేదండోయ్‌. నాగ్ అశ్విన్ తెర‌పైన భ‌విష్య‌త్ లో వాహ‌నాలు క‌మ్యూనికేష‌న్ స‌హా ప్ర‌తిదీ ఎలా మార‌బోతున్నాయో చూపించ‌నున్నాడు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే… ఈ సంవత్సరంలో భారీ పాన్ ఇండియా సెన్సేష‌న్ కోసం వేచి చూస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత‌ అత‌డు న‌టిస్తున్న‌ `దేవర: పార్ట్ 1` ఈ ఏడాది విడుద‌ల కానుంది. జ‌నవరిలో విడుదలైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై ఉత్కంఠ‌ను పెంచింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ‌వుతుంది? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త అయితే ఇంకా లేదు. అల్లు అర్జున్ `పుష్ప: ది రైజ్` భారీ విజయం సాధించాక పార్ట్‌ 2 కోసం మరింత ఎక్కువ శ్ర‌ద్ధ తీసుకుని ప‌ని చేస్తున్నాడు. పుష్ప 2 ఈ ఏడాది భారీ అంచనాల న‌డుమ విడుద‌ల కానుంది. పుష్ప‌రాజ్ న‌ట‌నాభిన‌యం, డ్యాన్సులు, బాడీ లాంగ్వేజ్, ఫైట్స్ కి ఉత్తరాదిలో భారీ ఫాలోయింగ్ పెరిగింది. అందుకే పుష్ప 2పై భారీ అంచ‌నాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఇరుగు పొరుగు మార్కెట్ల‌లో భారీ వ‌సూళ్ల‌ను తేగ‌లిగే చిత్ర‌మిద‌ని ప్ర‌చారం ఉంది. గూగుల్ ట్రెండ్స్ లోను పుష్ప 2 అత్యంత క్రేజీ సినిమాగా రికార్డుల‌కెక్కింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ సినిమాలతో అల‌రించ‌నున్నాడు. దేశభక్తి యాక్షన్-థ్రిల్లర్ `బడే మియాన్ చోటే మియాన్`లో టైగర్ ష్రాఫ్‌తో కలిసి అక్కీ న‌టిస్తున్నాడు. భారతదేశాన్ని విరోధి నుండి రక్షించడానికి ప్రయత్నించే వీరుడిగా అత‌డు క‌నిపించ‌నున్నాడు. మరోవైపు అక్ష‌య్ త‌న రెండో చిత్రాన్ని కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అక్ష‌య్, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి భారీ తారాగణంతో `వెల్‌కమ్ టు ది జంగిల్`తో అల‌రించ‌నున్నాడు. అజయ్ దేవగన్ న‌టించిన సింగం ఎగైన్ భారత స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది ఈ చిత్రంలో అజయ్‌దేవగన్‌ ఓ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ క‌థాంశంతో రూపొందుతోంది.