అర్పిత ముఖర్జీ పేరిట 31 బీమా పాలసీలు

  • అన్నింట్లోనూ నామినీగా పార్థ ఛటర్జీ పేరు
  • బెంగాల్ లో టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాం
  • మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్
  • ఈడీ అదుపులో ఆయన సన్నిహితురాలు
  • ఇరువురి మధ్య 2012 నుంచి సంబంధాలున్నాయన్న ఈడీ

పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసిన టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. అర్పిత ముఖర్జీ పేరిట భారీ సంఖ్యలో బీమా పాలసీలు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

అర్పిత ముఖర్జీకి చెందిన 31 బీమా పాలసీల్లో నామినీగా అన్నింట్లోనూ పార్థ ఛటర్జీ పేరే ఉందని ఈడీ వెల్లడించింది. కాగా, తమ అదుపులో ఉన్న నిందితులు కొన్ని ఆస్తులను నగదు రూపంలోనూ కొనుగోలు చేశారని ఈడీ వివరించింది. అయితే ఆ ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాన్ని వెలికితీయాల్సి ఉందని అభిప్రాయపడింది.

అంతేకాదు, అర్పిత ముఖర్జీ నివాసంలో జరిపిన సోదాల్లో… బోల్పూర్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన ఓ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ పత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. ఇది 2012 నాటిదని, దీన్నిబట్టి పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ మధ్య ఆర్థిక, భూ సంబంధ లావాదేవీలు గత పదేళ్లుగా సాగుతున్నాయని అర్థమవుతోందని ఈడీ పేర్కొంది.