పెళ్లి బంధం ఇష్టం లేదు… తల్లిదండ్రుల కోసమే పెళ్లి

సినిమావాళ్ళ ప్రేమలు.. పెళ్లిళ్లు అన్నీ ఓ హంబక్‌ లా ఉంటాయి. సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటారు. కానీ వివాహబంధం వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు కానీ ఎంత కాలం పాటు వారు కలిసి ఉంటారు అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే అన్నట్లు ఉన్నాయి ఆ వివాహ బంధాలు. వివాహం త‌ర్వాత క‌లిసి ఉన్న‌వారు ఉన్నారు. విడిపోయిన వారు ఉన్నారు. అందుకు ర‌క‌ర‌కాల కార‌ణాలుంటాయి. అలాంటి క‌థ‌లు…బంధాలు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ జోడీ అమీర్ ఖాన్-కిర‌ణ్ రావ్ ల ప్రేమ వివాహం..విడిపోవ‌డం తెలిసిందే. అమీర్ ఖాన్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే పెళ్లి చేసుకోవ‌డం అన్న‌ది కిర‌ణ్ రావ్ కి ఇష్టం లేదు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె రివీల్ చేసారు. ‘నిజాయితీగా చెబుతున్నా నేను-అమీర్ క‌లిసి ఏడాది పాటు స‌హ‌జీవ‌నం చేసాం. త‌ల్లిదండ్రుల బ‌ల‌వంతం వ‌ల్లే పెళ్లి చేసుకున్నాం. లేక‌పోతే చేసుకునే వాళ్లం కాదు. పెళ్లి అనే ఇన్‌స్టిట్యూట్ లో భార్యాభ‌ర్త‌లుగా, విడివిడిగానూ ప‌నిచేస్తే అది బాగా వ‌ర్కౌట్ అవుతుంది. కానీ పెళ్లి అనేది అమ్మాయిల్ని అణిచివేస్తుంద‌ని నేను భావిస్తున్నాను. అమెరిక‌న్ సైకాల‌జిస్ట్ ఎస్త‌ర్ పెర‌ల్ దీని గురించి మంచి పుస్త‌కం రాసారు. మ‌నం కోతులుగా జీవిస్తున్న‌ప్పుడు క‌లుస్తున్నాం. త‌ర్వాత కాల‌క్ర‌మేణా మాన‌వులు కుటుంబ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి వ‌ల్ల మ‌హిళ‌ల‌పై ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబాన్ని చూసుకోవాలి. అంద‌రూ క‌లిసి ఉండాలి. అత్త‌మామ‌లు, ఆడ‌ప‌డుచులు ఇలా భ‌ర్త వైపు నుంచి అంద‌ర్నీ చూసుకోవాలి. ఇలా పెళ్లైన ఓమ‌హిళ ద‌గ్గ‌ర నుంచి ర‌క‌ర‌కాల అంశాలు ఆశిస్తున్నారు. ఇలాంటి వాటితో నేను ఏకీభ‌వించ‌లేను` అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.