తల్లితండ్రుల పేరుమీద మొక్కలు నాటాలి

నాటిన మొక్కలు వృక్షాలు అయ్యేవరకు తల్లితండ్రుల్లా సంరక్షించాలి
నూజివీడులో మినీ జూ, ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం -రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు /ఏలూరు, ఆగష్టు, 30 : ప్రతీ ఒక్కరూ తమ తల్లిదండ్రుల పేరుమీద రెండు మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం బత్తులవారిగూడెం లోని నగరవనం లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తో కలిసి మంత్రి మొక్కలు నాటారు.

అనంతరం జరిగిన వనమహోత్సవ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పార్థసారథి ముఖ్యఅతిధిగా పాల్గొంటూ తల్లితండ్రులు మనకి జన్మనిస్తే చెట్లు మనం బ్రతికేందుకు ప్రాణవాయువును ఇస్తున్నాయని, ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ తల్లితండ్రుల పేరుమీద రెండు మొక్కలను నాటడంతో పాటు మన తల్లితండ్రులను ఎంత ఆదరణగా చూసి సంరక్షించుకుంటామో అదేవిధంగా నాటిన మొక్కలను వృక్షాలు అయ్యేవరకు పరిరక్షించాలన్నారు.

భారతదేశం ఒక పుణ్య భూమి అని, కొండలు, అడవులు, నదులతో పాటు దేశంలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయన్నారు. దేశంలో అటవీ ప్రాంతాలలో ఔషధ విలువలు కలిగిన వృక్షాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఔషధ విలువలు కలిగిన చెట్ల వేర్లతో భయంకరమైన కేన్సర్ వంటి వ్యాధులను కూడా నయం చేయవచ్చన్నారు. ప్రకృతి నుండి మనకు సహజంగా లభించే పళ్ళు, ఫలాలు వంటి వాటిని సద్వినియోగం చేసుకుంటే అనారోగ్య పరిస్థితులు దరిచేరవన్నారు. అడవుల పెంచడం, పర్యావరణ పరిరక్షణ, సహజవనరులను వినియోగం పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

నూజివీడు లో మినీ జంతుప్రదర్శన శాల, ఎకో టూరిజం: నూజివీడు లో మినీ జూ (జంతుప్రదర్శనశాల) ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమని మంత్రి పార్థసారథి చెప్పారు. నూజివీడు నియోజకవర్గంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందని, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, ఈ ప్రాంతంలో చెట్లను మరింత పెంచి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఎకో టూరిజం ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నగరవనంలో కూడా ప్రజలు పిల్లలతో వచ్చి సరదాగా గడిపే వాతావరణం ఏర్పాటుచేయాలన్నారు.

ఇందుకు అవసరమైన నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యత గా పలు పారిశ్రామిక సంస్థలు వారు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. నూజివీడు నియోజకవర్గంలోని అటవీ భూములకు సరైన సరిహద్దులు లేని కారణంగా అటవీ శాఖాధికారులకు, రైతులకు తరచూ తగాదాలు ఏర్పడుతున్నాయని, అధికారులు వెంటనే అటవీ ప్రాంతానికి ఖచ్చితమైన సరిహద్దులు నిర్ణయించి కంచెలు వేయాలని మంత్రి సూచించారు. ఆర్ ఐ ఎఫ్ ఆర్ భూములలో సంబంధిత రైతులు బోర్లు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రి అధికారులను కోరారు.