నంద్యాలలో రౌడీషీటర్ల దురాగతం

  • కానిస్టేబుల్‌ను వెంటాడి నడిరోడ్డుపై దారుణ హత్య
  • నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న సురేంద్రకుమార్
  • తొలుత తలపై బీరు సీసాతో కొట్టిన నిందితులు
  • ఆపై ఆటోలో చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి హత్య
  • నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు

నంద్యాలలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను వెంటాడిన రౌడీషీటర్లు ఆపై దారుణంగా హతమార్చారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన హత్యకేసు దృశ్యాలు వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. రాత్రి పట్టణంలోని టాటూ దుకాణం వద్ద మద్యం తాగుతున్న ఆరుగురు రౌడీషీటర్లకు కానిస్టేబుల్ సురేంద్రకుమార్ (35) కనిపించడంతో ఆపి ఆయనతో వాగ్వివాదానికి దిగారు. మాట్లాడుతుండగానే కానిస్టేబుల్ తలపై బీరు సీసాతో కొట్టారు.

నిందితులు ఎక్కువ మంది ఉండడంతో తప్పించుకునేందుకు సురేంద్రకుమార్ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆయనను పట్టుకున్న నిందితులు ఆటోలో ఎక్కించారు. అనంతరం ఆటో డ్రైవర్‌ను కత్తితో బెదిరించి పట్టణ శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. తలకు దెబ్బ తగలడంతో అప్పటికే స్పృహ కోల్పోయిన సురేంద్రను కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం ముగ్గురు అక్కడి నుంచే పరారయ్యారు. మిగతావారు తిరిగి పట్టణంలోకి వచ్చి బైక్‌పై వెళ్తున్న వారిని బెదిరించి వారి నుంచి వాహనాలు లాక్కుని వాటితో పరారయ్యారు.

బాధిత కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కిడ్నాప్, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.