దేశంలో పేదరికం తగ్గుతోంది – – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

దేశంలో పేదరికం తగ్గుతోంది
– పన్నుల వ్యవస్థ సరళంగా ఉండాలి
– ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
 శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌) ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
నాసిన్‌తో ఏపీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు : సీఎం జగన్‌ మోహన్ రెడ్డి
పెనుకొండ : మన పన్నుల వ్యవస్థ సరళంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌) ను ప్రధాని బుధవారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నాసిన్‌ ఏర్పాటు చేశాం. ఇది ప్రముఖ శిక్షణా సంస్థగా, సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారనుంది. సత్యసాయిబాబా స్వస్థలం పుట్టపర్తి కూడా ఈ జిల్లాలోనే ఉంది. గాంధీజీ అనేక సార్లు రామరాజ్యం గురించి ప్రస్తావించారు. రామరాజ్యంలో అందినట్లు ప్రజలకు సుపరిపాలన అందాలని ఆయన చెప్పారు.
సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలి. జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చాం.  నాసిన్‌ దేశంలో ఆధునిక ఎకో సిస్టంగా మారనుంది. ఇక్కడ జరిగే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఎంతో ప్రయోజనం. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేది. భూమి నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్టు పన్నుల విధానం ఉండాలి.
జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చాం. ఆదాయపన్ను చెల్లింపు విధానాన్నీ సులభతరం చేశాం. మేం వచ్చాక ఆదాయపన్ను పరిమితి పెంచాం. పన్ను చెల్లించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పన్నులు వసూలవుతున్నాయి. వచ్చే ఆదాయంతో దేశంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పదేళ్లుగా పన్ను రాబడి పెరిగింది. ఆ మొత్తంతో పెండింగ్‌లో ఉన్న అనేక పనులను పూర్తి చేశామన్నారు.
పరిపాలనా దక్షతకు శ్రీరాముడు మారుపేరు
 పరిపాలనా దక్షతకు శ్రీరాముడు మారుపేరు అని, ఆయన పాలన ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ రామరాజ్యం మనందరికీ ఆదర్శప్రాయం. రామరాజ్యం గురించి మహాత్మాగాంధీ అనేక సార్లు ప్రస్తావించారు. ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీ చెప్పారు’’ అని ప్రస్తావించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం సమీపంలో ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం
పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారి కోసం పదేళ్లుగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మా పథకాలు కాగితాలపై కాదు.. క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. తొమ్మిదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. పేదల సమస్యలు తొలగించడమే ప్రభుత్వ ప్రాధాన్యం కావాలి. వారి జీవితాలు బాగుపడ్డాయనే విషయం నీతిఆయోగ్‌ చెప్పింది.
 వివిధ ఉపాధి అవకాశాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చాం. అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతోంది. పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది. మేం వచ్చాక వాణిజ్య విధానాన్ని సులభతరం చేశామని వివరించారు. నాసిన్‌ దేశంలోనే అత్యున్నతమైన శిక్షణా సంస్థ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.
రెవెన్యూ సర్వీసులకు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రపంచ కస్టమ్స్‌ సంస్థ కూడా దీనికి గుర్తింపు ఇచ్చిందన్నారు. సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 500 ఎకరాల భూమి ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
*503 ఎకరాల్లో నాసిన్‌ : శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడి నుంచి గంటలో చేరుకునేంత దూరం ఉండటం కలిసొచ్చే అంశం. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఆవరణలోనే సోలార్‌ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు.
 శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకొచ్చారు. నాసిన్‌ కోసం ప్రత్యేక రైల్వేలైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నాసిన్‌తో ఏపీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు : సీఎం జగన్‌ మోహన్ రెడ్డి
వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ రావడం గర్వంగా ఉందని   సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు.  ఏపీకి నాసిన్‌ లాంటి వరల్డ్ క్లాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ రావడం గర్వంగా ఉందని, నాసిన్‌తో ఏపీకి ప్రపంచస్థాయి గుర్తింపు రానుందన్నారు. ఏపీ పేరును నాసిన్‌ అంతర్జాతీయంగా నిలబెట్టనుందని, నాసిన్‌ అకాడమీని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర  మోడీ కి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్జుల్‌ నజీర్, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి  నిర్మలాసీతారామన్, కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రులు పంకజ్‌ చౌదరి, చా.భగవత్‌ కిషన్రావ్‌ కరాడ్, రాష్ట్ర మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.