మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, మహానాడు : పట్టణంలో ప్రజల మౌలిక సదుపాయల కల్పనే ప్రథమ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నానని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఉదయం 22 వ వార్డు పరిధిలో హీరో హోండా షోరూం ఎదురుగా మంచినీటి పైపు లైన్‌ లీకేజీ పనులను, రిజిస్టర్‌ ఆఫీసు ముందు ఉన్న సులభ కాంప్లెక్స్‌ను సందర్శించారు. సులభ కాంప్లెక్స్‌ ద్వారా వచ్చే వ్యర్థాలను మురుగు నీటి కాల్వలోకి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం టిడ్కో గృహ సముదాయాన్ని సందర్శించి, మంచినీటి చెరువు వద్ద ఉన్న ఫిల్టర్‌ బెడ్‌ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. అనంతరం గణపవరం మంచినీటి చెరువును పరిశీలించడం జరిగింది. ఈ సంధర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ, టిడ్కో గృహాల లబ్దిదారులకు పలు సమస్యలు ఉన్నాయని, నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వం నుంచి గృహాల లబ్దిదారులకు సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే నాన్‌ లే అవుట్ల పేరిట గత 5 సంవత్సరాలలో జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి ధృడమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లే అవుట్‌ లు ద్వారా ఇక నుండి స్థిరాస్తి వ్యాపారులు వారి వ్యాపారం స్వేచ్చగా చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలకు కూడా లే అవుట్‌ లలో ప్లాట్లు కొంటే అనుమతులు కూడా వెంటనే వస్తాయని తెలిపారు. మరింత మెరుగైన శానిటేషన్‌ పట్టణ వాసులకు అందించి ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా సాగుతామని తెలిపారు.