Mahanaadu-Logo-PNG-Large

ఛత్తీస్‌ గఢ్‌ జర్నలిస్టుల కేసుపై రీ ఎంక్వైరీ

– హోమ్ మంత్రి వంగలపూడి అనిత

అమరావతి, మహానాడు: ఛత్తీస్‌ గఢ్‌కు చెందిన ఆరుగు జర్నలిస్టులపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసుపై రీ ఎంక్వైరీ కి ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ( ఏపీయూడబ్ల్యు) నేతలు హోమ్ మినిస్టర్ ను కలిశారు. ఆ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు కేసు పూర్వ పరాలను వివరించారు. ఈ కేసు పై ఛత్తీస్‌ గఢ్‌ పోలీస్ అధికారులు స్పందించి కొండ సబ్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్ళారు. జర్నలిస్టుల పై అక్రమ కేసు నమోదులో చింతూరు సీఐ పాత్ర ఉందని వెంటనే వెరిఫై చేసి కేసు ఎత్తివేయాలని కోరారు. వెంటనే స్పందించిన హోంమంత్రి.. అల్లూరి సీతారామ జిల్లా ఎస్పీతో మాట్లాడి ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఘటనపై రీ ఎంక్వయిరీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని ఎస్పీ కి ఆదేశాల ఇచ్చారని నాయకులు తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని యూనియన్ నేతలు కోరారు. ఈ సందర్భంగా అనేక కేసులను వివరించారు. జర్నలిస్ట్ లపై దాడులు చేసిన కేసులను పునర్విచారణ చేసి దోషుల పై చర్యలు తీసుకోనే విధంగా పోలీస్ శాఖను ఆదేశించాలని సూచించారు. తప్పకుండా న్యాయం చేస్తానని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, యూనియన్ రాష్ట్ర నాయకులు కృష్ణ మోహన్, సచివాలయ జర్నలిస్టులు సత్యనారాయణ, రామకృష్ణ, ప్రసన్నకుమార్, విజయ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.