– తప్పుచేసిన వారు తప్పించుకోలేరు…
– నేరం చేయనప్పుడు భయం ఎందుకు?
– ప్రజా వినతుల స్వీకరణ అనంతరం మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర
మంగళగిరి, మహానాడు: రెడ్ బుక్ చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని… తప్పు చేసిన వారు ఎప్పటికైనా తప్పించుకోలేరని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు మూస్తాక్ అహ్మద్ తో కలిసి నిర్వహించిన ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తప్పు చేయనప్పుడు వైసీపీ నేతలకు భయం ఎందుకన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు ఎక్కడ దాక్కున్నారో తెలియదన్నారు. తప్పు చేయబట్టే వైసీపీ నేతలు కలుగులోకి వెళ్లి దాక్కొంటున్నారని విమర్శించారు.
ప్రజల కష్టాలు, కన్నీళ్లలోనుండి పుట్టుకొచ్చిన రెడ్ బుక్ ను చూసి వైసీపీ నేతలు గజగజలాడుతున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల శ్రేయుస్సు కోసం ఆలోచించే నాయకుడని తెలిపారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. మంత్రి లోకేష్ తో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగా నేడు నూకసాని బాలజీ, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మౌలానా ముస్తాక్ అహ్మద్ తో పాటు పలువురు టీడీపీ నేతలతో ప్రజల నుండి వినతులు స్వీకరించినట్టు పేర్కొన్నారు.
అధికారం మదంతో నాడు జోగి రమేష్ పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను మండలాల నుండి రౌడీలు, వైసీపీ కార్యకర్తలను తీసుకు వచ్చి నాటి మాజీ, నేటి ముఖ్యమంత్రి ఇంటిపై పైశాచికంగా దాడికి తెగబడ్డారని.. ఆ మండలాల టీడీపీ నేతలు కార్యకర్తలు నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారన్నారు. దాడులకు తెగబడిన వారు.. చీలంకుర్తి వెంకట శివకృష్ణ, ఈదా కిషోర్, ఆకన సాయి కుమార్, పులగం నాయుడు, పాలపర్తి జాన్ రత్నం, మండ్రు సాల్మన్ రాజు, కారుమంచి కామేశ్వరరావు, పిండి వెంకన్నబాబు, మోటేపల్లి రత్నారావు, అల్లంశెట్టి నిరంజనరావులతో పాటు మిగిలన వారి పేర్లు కూడా గ్రీవెన్స్ అర్జీలో పొందుపరిచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
• గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం స్వర్ణభారతి నగర్ కు చెందిన 19వ లైన్ నివాసితులు (ముస్లింకు కుటుంబాలు) వాపోతూ.. వైసీపీ ప్రభుత్వంలో కొంత మంది రౌడీ మూకలు వచ్చి తమ ఆడవాళ్ల స్నానాల కోసం ఏర్పాటు చేసుకున్న బాత్ రూంలను ధ్వంసం చేసి స్థలాలను కబ్జా చేశారన్నారు. తమను బెదిరించి తమ ఇళ్లకు కరెంట్ కట్ చేసి కరెంట్ మీటర్లు పీకించారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు
• ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు దివ్యాంగులు వాపోతూ… వికలాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వికలాంగులకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. వైసీపీ నేతలతో కలిసి అక్రమ నిర్మాణాలకు సహకరించిన సీఎస్ఆర్ స్వామితో పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు దివ్యాంగులు నేడు గ్రీవెన్స్ లో వాపోయారు.
• ఏపీఎస్‌ఎస్‌ఏఏటీ-టీడీ సంస్థ నందు డీఆర్‌పీ లుగా పనిచేస్తున్న తమని గత ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని.. దీనిపై దళిత సంఘ నేతలతో న్యాయపోరాట దీక్ష చేశామని.. దీంతో దిగివచ్చిన అధికారులు తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఆర్డర్ కాపీ ఇచ్చారన్నారు. కాని తమను విధుల్లోకి తీసుకోలేదని.. వెళ్లి అడిగితే.. ప్రజా సంఘాలతో ఆఫీసుకు వెళ్లామని ఏపీఎస్‌ఎస్‌ఏఏటీ- ఆర్‌డీ డైరెక్ట్ గా తాను ఉన్నంతవరకు విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని ప్రస్తుత డైరెక్ట్ ఎం. జగదీష్ అన్నారని తెలిపారు. తన బావ ఎమ్మెల్సీ ఎం. అరుణ్ కుమార్, నాటి ఎమ్మెల్యే ఎం. అరుణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బెదిరించాడని.. అలానే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి 4 రోజులు పోలీసులతో కొట్టించాడని వాపోయారు. కావున తమకు న్యాయం చేసి తమకు కొట్టించిన జగదీష్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
• అక్రమ కేసులో చంద్రబాబు జైల్లో నుండి బయటకు వచ్చారని బాణసంచా పేల్చితే రీ సర్వే పేరుతో వైసీపీ నేతలు తన పొలాన్ని ఎన్నికల ముందు మరోకరి పేరుపైకి మార్చారని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు పాచిగుంట పంచాయతీకి చెందిన ఎం.వడివేలు వాపోయారు. వైసీపీ నేతల అరాచకాలను అరికట్టి తన పొలం తనకు దక్కేలా చూడాలని గ్రీవెన్స్ లో వేడుకున్నాడు
ఉండటానికి ఇల్లు లేక… ఇంటికోసం 2006లో స్థలం కొనుక్కుంటే దాన్ని కబ్జా చేశారని.. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మేకపాటి రాజగోపాల్ చొరవతో దాన్ని పోలీసులు నీరుగార్చారని.. దాంతో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని… ఈ భూ ఆక్రమణపై విచారించి… తన స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెం గ్రామ పంచాయితీ కుడముల దిన్నెపాడు కు చెందిన మల్లె వెంకటేశ్వరరావు వాపోయాడు.
• గత ప్రభుత్వంలో బాపులపాడు మండలంలోని కోడూరుపాడు, అంపాపురం గ్రామాల్లో వైసీపీ నాయకుల అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి పంటలు పండించుకొంటున్నారని వాటిని కాపాడాలని సూర్యనారాయణ నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• జల జీవన్ పథకంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ని పిళ్లికుంట తాండాకు రూ. 17 లక్షలు, నాగరాజు తాండ గ్రామానికి రూ.23 లక్షలు, మెట్టతోడు తండాకు రూ.23 లక్షలు మంజూరు అయినప్పటికీ ఆ నిధులను ఖర్చు చేయడంలేదని… దీంతో ఆ గ్రామాల్లో మంచినీటికి ఇబ్బంది పడుతున్నామని నేడు ఆ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• గుంటూరు జిల్లా కాకుమాను మండలం భల్లుఖానుడు పాలెం గ్రామ రైతులు వాపోతూ.. తమ వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని కాలువలకు నీరు విడిచినా తూడు, గుర్రపు డెక్క మేట వేయడంతో శివారు ప్రాంతాలకు నీరు రాక పంట మొత్తం ఎండిపోతోందని.. దయచేసి సాగునీరు అందేలా చూడాలని ఆ గ్రామ రైతులు వేడుకోకా మంత్రి వేంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
• టీడీపీ ప్రభుత్వంలో పల్లెల్లో అంధకారం తొలగించేందుకు వీధి లైట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా చంద్రన్న వెలుగు స్కీమ్ కింద వీధి లైట్లు మార్చేందుకు చేసిన పనులకు నేటికి బిల్లులు రాలేదని.. 2019 లో వైసీపీ పార్టీలో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తమకు బిల్లులు ఇవ్వలేదని… తనకు రావాల్సిన వర్క్ బిల్లులను వెంటనే ఇప్పించాలని విశాఖ జిల్లాకు చెందిన కె.వి. రమణబాబు వేడుకున్నాడు.
• తాను మీడియాలో పనిచేస్తున్నానని.. తన యజమాని ఒక వార్తను పెట్టి గ్రూప్ లో షేర్ చేయమంటే దాన్ని షేర్ చేసినందుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆదేశాలతో తనపై అక్రమంగా కేసులు బనాయించి రిమాండ్కు పంపారని.. తనకు న్యాయం చేసి అక్రమ కేసు కొట్టేసేందుకు చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటు పాలెంకు చెందిన తోకల సురేష్ కోరారు.
• గత ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మభ్యపెట్టి కాలం గడిపినందున తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. డిఎస్సీకోసం లక్షల రూపాయలు కోచింగ్ లకు పెట్టి చితికిపోయామని దయచేసి ప్రకటించే డిఎస్సీలో కనీస వయసు పరిమితిని ప్రస్తుతం ఉన్నదానికి కనీసం ఐదు సంవత్సరాలు పెంచి ఆదుకోవాలని నిరుద్యోగులు కోరారు.
వీటితో పాటు గ్రంథాలయ ఉద్యోగుల సమస్యలు, పింఛన్ దారుల సమస్యలు, పెండిగ్ బిల్లుల సమస్యలు, ఇళ్ళ స్థలాల సమస్యలు, ఎడ్యూకేషన్ లోన్ సమస్యలు, ఉద్యోగ బదిలీలు, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సీఎంఆర్ఎఫ్, రేషన్ కార్డు సమస్యలు, పంటకాలువ సమస్యలు ఇలా అనేక సమస్యలతో నేడు గ్రీవెన్స్ కు అర్జీదారులు పోటెత్తారు.