నువ్వుంటే నవ్వున్నట్టే..

తెలుగు సినిమాలో
నీతోనే పుట్టింది కామిడీ..
ఇప్పటికీ నిఖార్సయిన కామిడీకి నువ్వే
ఓ ఒరవడి
నువ్వు కనిపిస్తేనే చాలు
నవ్వే వారు ధియేటర్లలో
జనం పడిపడి..
అసలు నీ నడకే చిత్రమైన
నవ్వుల గారడీ..
సినిమాలో నువ్వుంటే నవ్వున్నట్టే..!

వెంకట్రామయ్య
అంటే అదెవరని
అడుగుతారేమో జనం..
రేలంగి అంటేనే
నవ్వుల ఫిరంగి
నందమూరి అవతారమూర్తి..
రేలంగి హాస్యానికే కీర్తి
కృష్ణుడిగా..రాముడిగా
ఎన్టీఆర్ వెండితెరకు వెలుగు
ఉత్తర..లక్ష్మణ కుమారులుగా
రేలంగి అభినయం
మాయాబజార్ కు పారాహుషార్..
నర్తనశాలకు కలక్షన్ల హేల..!

ఏడాది లంకలో ఉన్న సీతని ఏలుకున్న వెర్రి రాముడిని కానంటూ రాములోరి కొంపముంచిన చాకలి..
ఆన్నగారిగా రామారావుకు
నామకరణం చేసిన
రెండుచింతలు..
సరదా సరదా సిగరెట్టు..
నీ పాటతోనే రాముడు..భీముడు
మరీ మరీ హిట్టు..
ఇద్దరు మిత్రులులో
బుర్ర మీసాల బలరామయ్య..
కామిడీ విలనీలోనూ
అందెవేసిన చెయ్యి
మా రేలంగి వెంకట్రామయ్య..!

రేలంగోడితో సూర్యకాంతం
చిరునవ్వుల నవవసంతం..
గిరిజతో కలిసి
ఆశ…ఏకాశ..అంటూ
సినిమా నీడన
కామిడీ మేడలు కట్టేసావు..
దేవతలో పద్మనాభం అన్నట్టు నిన్ను చూస్తేనే
ఆపుకోలేని నవ్వు..
నువ్వన్నావు..
చెప్పయినా నవ్వు..
లేక నవ్వయినా చెప్పమని..
నువ్వు పోయి ఇన్నేళ్ళయినా
ఆగితే కదా
నువ్వు పంచిన
ఆ నవ్వు..
హాస్యానికి సిసలైన
చిరునామా నువ్వు..
జగదేకవీరుని కథలో రెండుచింతల మహారాజు..
తెలుగు సినిమా చరిత్రలో
తిరుగులేని
నవ్వుల మారాజు..!
హాస్యబ్రహ్మ రేలంగి
జయంతి(09.08.1910) సందర్భంగా
ప్రణామాలు అర్పిస్తూ

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286