– జగనన్న ఫ్లెక్సీ కోసం ట్రాఫిక్‌సిగ్నల్స్‌కు కత్తెర
– కాకినాడలో వైసీపీ వీరభక్తుల అత్యుత్సాహం
– కటింగ్ మిషన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ కట్
– కేసులు పెడతారా? కళ్లు మూసుకుంటారా?
– కాకినాడ కొండవీటి సింహాల వృత్తిధర్మానికి పరీక్ష
– సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘ఊరు మనదే తోసెయ్’ అని అదేదో పాత సినిమాలో నూతన్ ప్రసాద్ డైలాగు. ఆ సినిమా వచ్చి కూడా ముప్ఫైఏళ్లు దాటి ఉంటుంది. ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ ఊళ్లో ఏది అడ్డువచ్చినా తీసేస్తుంటాడు. కనిపించిన వాటిని కొట్టుకుపోతుంటాడు. ఎప్పుడో వచ్చిన ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ డైలాగును వైసీపీ వీర భక్తులు, కాకినాడలో మరోసారి గుర్తుచేశారు. అంటే.. ఊరుమనదే తోసెయ్ అని నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ చెబితే… కాకినాడ మనదే కోసెయ్ అని అధికారపార్టీ నేతలు ఆవిధంగా ముందుకెళ్లారన్నమాట.
మంత్రులతో నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర కాకినాడ కు చేరింది. ఆ ఏర్పాట్లలో శ్రమదానం చేస్తున్న వైసీపేయులు జగనన్న ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ షిక్కటి షిరునువ్వులు షిందిస్తున్న జగనన్న ఫ్లెక్సీకి, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డం వచ్చాయి. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నందున, జగనన్న ఫ్లెక్సీ జనాలకు దర్శనభాగ్యం అవకాశం లేకుండా చేశాయి. దానితో వైసీపీ వీరభక్తులు బాగా ఫీలయ్యారు.
మరింకేం? వైసీపీ గండరగండలు రంగంలోకి దిగి, కాగల కార్యం కట్టింగ్‌మిషన్‌తో కానిచ్చేశారు. అంటే పైకి ఎక్కి కటింగ్ మిషన్ సాయంతో, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎంచక్కా కట్ చేశారన్నమాట. ఆవిధంగా జగనన్న ఫ్లెక్సీని ఆసాంతం దర్శించే మహద్భాగ్యం కాకినాడ నగర పౌరులకు
కలిగించారు. మరి అందుకు పోలీసు శాఖ అనుమతి తీసుకున్నారా అని అడిగిన వారు, అమాయకుల కింద లెక్క, బహుశా నూతన్‌ప్రసాద్ ’ ఊరుమనదే తోసెయ్’ డైలాగే వారికి స్ఫూర్తిగా నిలిచినట్లుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అదృష్టం బాగుండి ఆ ఫ్లెక్సీ ఎస్పీ ఆఫీసు గోడకు ఆనుకుని లేదు. ఒకవేళ ఉంటే, వైసీపీ బాహుబలులు ఎస్పీ ఆఫీసు గోడ సంగతి కూడా చూసేవారంటూ, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి నీతి- నిజాయితీ-పారదర్శకత-కార్యదీక్ష-నిర్మొహమాటానికి నిలువెత్తు నిదర్శనమైన మన కాకినాడ కొండవీటి సింహాలు వైసీపీ వీరులపై ఎలా గర్జిస్తాయో చూడాలి. మామాలుగా అయితే అలాంటి పనులు ఏ సుబ్బారావులో.. పుల్లారావులో చేస్తే.. పోలీసు సార్లు వాళ్ల చేతులు విరిచి, మక్కెలు విరగ్గొట్టి, మోకాళ్లు చేతికిచ్చేలా లాఠీలకు పనిచెబుతారు. కానీ అక్కడున్నది సుబ్బారావులు కాదు, పుల్లారావులు కాదు. వైసీపీ వీరభక్తులు. అద్గదీ సంగతి!