పెమ్మసాని జోక్యంతో రద్దయిన రైళ్ల పునరుద్ధరణ

-కేంద్ర సహాయ మంత్రి ఆదేశాలకు స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే
-గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు రైళ్ల పునరుద్ధరణ

విజయవాడ, మహానాడు: రైల్వే ప్రయాణికుల ఇక్కట్లను గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్క లేఖతో పరిష్కరించారు. గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు మీదుగా ప్రయాణించే రెండు రైళ్ల రాకపోకల రద్దును రైల్వే అధికారులతో మాట్లాడి తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చేశారు.

వివరాల్లోకి వెళితే.. నూతన రైల్వే లైన్ నిర్మాణం, రైల్వే సిగ్నలింగ్ ఆధునీకరణ నేపథ్యంలో ఇటీవలే 25 ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను రద్దు చేస్తున్నట్లుగా రైల్వే శాఖ ఇటీవల ప్రకటించింది. అందులో భాగంగా గూడూరు-విజయవాడ, విజయవాడ – గూడూరు మీదుగా రాకపోకలు సాగించే రెండు రైళ్ళను కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ఒంగోలు-బాపట్ల-తెనాలి మీదుగా విజయవాడకు నిత్యం ప్రయాణించే కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికుల సమస్యను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు కేంద్ర సహాయ మంత్రి సోమవారం నాడు లేఖ రాశారు.

డాక్టర్ పెమ్మసాని జోక్యంతో రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తక్షణమే స్పందించారు. విజయవాడ-గూడూరు, గూడూరు- విజయవాడ మార్గం గుండా ప్రయాణించే 12734, 12733 రైళ్ళను పునరుద్ధరిస్తూ సోమవారం సాయంత్రానికి ఆదేశాలు జారీ చేశారు. రైళ్ల రద్దుతో స్తంభించిన ప్రయాణాలు ఈ ఆదేశాలతో మళ్లీ ముందుకు కదలడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఇక్కట్లపై స్పందించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.