రాష్ట్రంలో 187 పనులకు రూ. 1,045.44 కోట్లు మంజూరు

– డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు

దేవరాపల్లి, నవంబర్,17. రాష్ట్రంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని 187 అభివృద్ధి పనులకు రూ. 1,045.44 కోట్లుని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేశారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. తారువలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

జీ.ఓ.నం: 788 ప్రకారం ఈ పనులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి పరిపాలన ఆమోదం లభించిందన్నారు. త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. తమ శాఖకు చెందిన 115 రోడ్ల విస్తరణ చెయ్యడానికి రూ. 576.15 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇదే శాఖకు చెందిన 72 వంతెనల నిర్మాణానికి రూ.469.29 కోట్లు మంజూరు చేశామన్నారు. 115 రోడ్లు విస్తరణ వల్ల 916 కిలోమీటర్ల మేర రోడ్లు బాగుపడతాయన్నారు.

ప్రధానమంత్రి గ్రామీణ స్వరాజ్య యోజన పథకం ఫేజ్-3 కింద మంజూరైన ఈ పనులకు అయ్యే వ్యయంలో కేంద్రం తమ వాటా కింద 60 శాతం భరించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 40 శాతం భరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఒకే సారి ఇన్ని రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ రోడ్ల పనులతో పాటు వంతెనల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రహదారి కష్టాలు తీరుతాయన్నారు.

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అనునిత్యం పరితపించే జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి సీఎం కావడం తమ అదృష్టంగా ప్రజలు భావిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే తమ పనితీరుకి నిదర్శనమన్నారు.