అరుదైన స్వరం..దేవుడిచ్చిన వరం!

ఆ స్వరపేటిక
స్టార్ డంకు వాటిక..
గాంభీర్యానికి పీఠిక..
అది రాజశేఖరం
వాచిక శిఖరం..
ఆపై సుమనోహరం..
హరహరం..
సాక్షాత్తు పరమేశుని
కంఠహారం..!

సాయికుమార్..
తండ్రి శర్మ నుంచి
లభించిన అద్భుత స్వరసంపద..
గర్జించే గళం..
అది అనర్గళం..
వచనమే హిందోళం..
కోపగించి స్వరం పెంచితే
అదిరిపోవునేమో భూగోళం..!

అభినయంలోనూ
ఈ సాయి సూపరోయి..
చక్కని కనుదోయి..
అసలేం గుర్తుకు రాదు
కన్నుల ముందు
నువ్వు ఉండగా…
మెప్పించాడు సౌందర్యనే
అందంగా..
అంతరంగమే అంతఃపురంగా
పసుపు పచ్చని చొక్కాతో
టింగురంగా..!

తనకు తానుగా మాటాడితే
అంకుశం..
గాంభీర్యం ఉండదే లవలేశం..
అదే సాయికుమార్
గొంతు కలిస్తే..
కనిపించడా
నిజమైన జమాను..
ఈ సాయి స్వరంతోనే
వెలిగిపోయింది
రాజశేఖరుని జమానా…!

కనిపించని
నాలుగో సింహం
మైకు పడితే
నిజంగా సింహమే..
మాట ఎక్కడ మెత్తాలో..
ఇంకెక్కడ నొక్కాలో..
ఎక్కడ పెంచాలో..
మరెక్కడ తగ్గాలో..
ఆ తంత్రం తెలిసిన మంత్రం..
హీరోలకు ఆయన కంఠం
సక్సెస్ హామీ పత్రం..
మొత్తంగా అతగాడో
మాటల యంత్రం..
అదే అదే సాయికుమార్
సక్సెస్ సూత్రం..!

జన్మదినవేళ..
సాయి గళానికి..
అందులోని గాంభీర్యానికి
లాలిత్యానికి..
ఆ ఉచ్చారణకి..
ఆ విరుపుకి..
ఆ మెరుపుకి..
మైమరపుకి..
ఓ పెద్ద ‘వోవ్’
సాయీ..వారేవావ్!!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286