అబ్బో..శారద సినిమానా
మగాళ్ళయితే ఖచ్చితంగా
రుమాళ్లు తీసుకెళ్లాల్సిందే!_
అదే ఆడాళ్ళయితే
చెంగులు తడిచిపోయినట్టే!!
ఔను..
ఆమె అపురూప అభిసారిక..
వెండి తెరపై కన్నీటి చారిక..
అందుకే..అందుకే తొలిరేయి
అంత హాయి..
అంత హాయి
ఆ పాట ముగిసేలోగానే
బొట్టు చెదిరి
నీ రాక కోసం నిలువెల్ల కనులై
నీ రాధ వేచేనురా..
తనే ఆలపించిన
విషాద గీతిక..
అదే శారద..
ఖాకీ దుస్తులు తొడిగితే
ప్రశ్నించే మహిళల ప్రతిధ్వని..
ప్రేమఖైదీకి అండగా
నిలిచే జైలరమ్మ..
పొగరుబోతు అనసూయమ్మ..
కొడుకుల వైఖరికి విసుగెత్తి
రాజీనామా చేసిన
నిన్నటి తరం అమ్మ..!
పాపాయి నవ్వాలి..
పండగే రావాలి..
మా ఇంట కురవాలి పన్నీరు..
పాపాయి నవ్వినా..
పండగే వచ్చినా..
పేదల కన్నుల కన్నీరే..
నిరుపేదల కన్నుల కన్నీరే..
ఇలా ఆశనిరాశల డోలికల్లో
నలిగిపోయిన దంపతుల్లో
భర్త మరణిస్తే
మనుషులు మారాలి అంటూ ఒంటరిగా పోరాటం సాగించి
అలా మార్చలేక బిడ్డలను
చంపి దోషిగా చట్టం ముందు తలవంచి చివరకు
తానూ కడతేరిపోయిన
విధివంచిత విజయ..
చూసిన ప్రేక్షకుల
గుండె చెరువు..
ఈ సినిమాతోనే శారద
అభిమానులకు
మరింత చేరువు..!
ఇదే సినిమా తులాభారం
ఆమెను చేసింది ఉర్వశి..
ట్రాజెడీకి ఆమె
అయింది వాసి..
ఆత్రేయ రాయగా..
బాలు పాడగా..
సూపర్ స్టార్ అభినయించి
అభివర్ణించిన ఆశ్రమవాసి..!
బలిపీఠం..కాలం మారింది..
శారద..ఇలా శోభన్ బాబుతో
సినిమాల వరద..
హిట్టు సినిమాల పరంపర..
_నీ తొలిచూపులోనే.._
అంటూ నందమూరితో
డ్యూయెట్…
ఆయన కర్ణ సినిమాలో
పాంచాలిగా హిట్..
చండశాసనుడులో పెద్దాయన రామారావుతో
నటనలో పోటీ
మళ్లీ చంద్రకాంత్ లో
చివరి భేటీ..
ఇంటాయన చలంతో
సంబరాల రాంబాబు..
పద్మనాభంతో
డివ్విడివ్వి డివ్విట్టం..
నువ్వంటేనే నాకిష్టం..
ఢీకొట్టింది అదృష్టం..
గట్టెక్కింది మన కష్టం..
అదృష్టమో..పడిన కష్టమో
కార్చిన కన్నీరో…
పలికిన మాటలో..
అందాలరాశి కాకున్నా
మూడుసార్లు
అయింది ఉర్వశి..
ఎన్టీఆర్..చిరంజీవి..
ఇలాంటి స్టార్లకు కధలు రాసే
పరుచూరి సోదరులు..
తన కోసం సృష్టిస్తే
ఓ బలమైన కారెక్టర్..
హీరోలతో సమంగా
అభినయంతో అదరగొట్టే
అద్భుత యాక్టర్..
న్యాయం కావాలిలో
చిరంజీవినే బెంబేలెత్తించిన
అణురియాక్టర్..
అదే అడవిదొంగ చిరును
మార్చుకున్న అమ్మ..
సెల్యూలాయిడ్ని తడిపేసిన
కన్నీటి బొమ్మ..
అపుడపుడు మెరిసే
మోడరన్ బామ్మ..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286