కౌంటింగ్‌ రోజైనా భద్రతకు భరోసా ఇవ్వాలి

ఎన్నికల కమిషన్‌ తగిన ఏర్పాట్లు చేయాలి
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు

వినుకొండ, మహానాడు : పోలింగ్‌ రోజు హింసాత్మక ఘటనల అనుభవాల నేపథ్యంలో కౌంటింగ్‌ రోజైనా భద్రతకు ఎన్నికల సంఘం, పోలీస్‌ వ్యవస్థ భరోసా ఇవ్వాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా సహా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ ఇప్పటినుంచే చర్యలు తీసుకోకపోతే వైసీపీ రౌడీమూకలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విధుల నుంచి తప్పించమని కోరుతున్న రిటర్నింగ్‌ అధికారుల విజ్ఞప్తులే ఇందు కు నిదర్శనమన్నారు. తాడిపత్రి రిటర్నింగ్‌ అధికారి సెలవుపై వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. రిటర్నింగ్‌ అధికారులకే ఈ దుస్థితి ఉంటే ఇక ఎన్నికల సంఘం, పోలీసులు ఏం చేస్తున్నారనుకోవాలని ప్రశ్నించారు. కౌంటింగ్‌ రోజు ఒక్క చిన్న అవాంఛనీయ ఘటనకు ఆస్కారం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.