నేను లైఫ్‌లో చూడని ఇన్‌సిడెంట్స్‌ ఈ కథలో ఉంటాయి-హీరో సుహాస్‌

“కలర్ ఫొటో”, “రైటర్ పద్మభూషణ్” సినిమాలతో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. కంటెంట్ ఓరియెంటెడ్ గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫిబ్రవరి 2వ తేదీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీ హైలైట్స్ చెప్పారు హీరో సుహాస్. గతేడాది ఫిబ్రవరిలో రైటర్ పద్మభూషణ్ రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ ఫిబ్రవరికి “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్ముతున్నాం. ఈ మధ్యే బాబు పుట్టాడు. మంచి జరుగుతుందనే అనిపిస్తోంది.

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు ఎక్కువ రోజులు ప్రిపేర్ అయ్యాం. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథలో బాగా కనెక్ట్ అవ్వాలని అనుకున్న సీన్స్ ప్రాక్టీస్ చేశాం. రెండు సార్లు గుండు గీయించుకున్నా. అలా రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి కష్టపడ్డాం. మా నమ్మకం, రెండేళ్ల కష్టం సక్సెస్ రూపంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. అమలాపురం, అంబాజీపేటలో షూటింగ్ చేశాం. నాకు అక్కడి వాతావరణం, స్లాంగ్ గురించి తెలుసు. ఆ ఏరియాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. టైమ్ దొరికితే ఫ్రెండ్స్ తో అక్కడి ఏరియాలకు వెళ్తుంటాను. దుశ్యంత్ రాసిన కథ నన్ను కదిలించింది. అప్పుడు లాక్ డౌన్ టైమ్ కాబట్టి చాలాసార్లు స్క్రిప్ట్ చదువుకుని ఏ పాయింట్స్ బాగున్నాయో డిస్కస్ చేసేవాళ్లం. గుండు చేయించుకోవాలి అంటే కథ మీద నమ్మకంతో ఓకే అన్నాను. మా టీమ్ అంతా స్క్రిప్ట్ మీద నమ్మకంతో వర్క్ చేశాం.

ఈ కథలో జరిగిన ఇన్సిడెంట్స్ నేను రియల్ లైఫ్ లో చూడలేదు గానీ మా డైరెక్టర్ చూసిన సంఘటనలు కథలో సగం వరకు ఉంటాయి. తను చూసినవి, తనకు లైఫ్ లో జరిగిన కొన్ని సందర్భాల స్ఫూర్తి ఈ కథలో ఉంది. మిగతాది సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాడు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” 2007 లో జరిగే కథ. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ వరకు చూశాక సినిమా బాగా చేశారని ఫీల్ అవుతారు. ఆ తర్వాత మూవీ ఎమోషనల్ గా ఫీల్ తో సాగుతుంది. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు సరదాగా సాగుతుంటాయి. కలర్ ఫొటోలో ఎమోషన్ కూడా ఉంటుంది. కానీ ఈ సినిమాలో హై ఎమోషన్ ఉంటుంది.

రేపు సినిమా చూశాక ఇంత ఎమోషనల్ గా ఎలా నటించారని మీరే అడుగుతారు. నేను షార్ట్ ఫిలింస్ లో నటిస్తున్నప్పటి నుంచి డైరెక్టర్ దుశ్యంత్ తెలుసు. డియర్ కామ్రేడ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా తను వర్క్ చేశాడు. అప్పటి నుంచే నీతో సినిమా చేస్తా అనేవాడు. నేను కమెడియన్ గా బాగుంది నా కెరీర్ . నా కెరీర్ చెడగొడతావా నేను హీరో ఏంటి అని వద్దని చెప్పేవాడిని. కలర్ ఫొటో మూవీ వచ్చాక…మీ వాళ్లతోనే హీరోగా చేసుకుంటావా నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా కదా అన్నాడు. అప్పుడు వెంటనే ఈ మూవీ స్టార్ట్ చేశాం.