తెలుగు సినీ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో క్రమశిక్షణ లోపించిందని అన్నారు. సినిమా షూటింగుల్లో సమయపాలన కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఫిలింమేకర్స్ బయ్యర్ల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు.
ఇప్పటి రోజుల్లో కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారని వెల్లడించారు. ఆ సినిమాపై నమ్మకంతో కొనుగోలు చేసే బయ్యర్లు, సినిమా ఫ్లాప్ అయితే తీవ్రంగా నష్టపోతున్నారని సుమన్ వివరించారు. సినిమా రిలీజయ్యాక బయ్యర్ల పరిస్థితి గురించి ఆలోచించేవాళ్లే లేరని అన్నారు.
అప్పట్లో దాసరి నారాయణరావు గారు బయ్యర్ల గురించి ఆలోచించేవారని, ఒక సినిమా పోతే, ఆ తర్వాత సినిమాను ఉచితంగా చేసి బయ్యర్లను ఆదుకునేవారని సుమన్ తెలిపారు. ఇప్పుడా పరిస్థితి లేదని, మేకర్స్ కారణంగానే బయ్యర్లు సంతోషంగా ఉండడంలేదని పేర్కొన్నారు.