Mahanaadu-Logo-PNG-Large

స్మశానంలో టీజర్ లాంచ్.. పిచ్చిపీక్స్‌

అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌ చిత్రమే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. గీతాంజలి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నద్ధమవుతోంది. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’లో హీరోయిన్ అంజలికి ఎంతో ప్రత్యేకమైనదనే చెప్పాలి. కథ మొత్తం ముఖ్యంగా తన పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటమే కాదు, ఆమె కెరీర్‌ మైల్ స్టోన్ మూవీ 50వ చిత్రంగా అలరించనుంది. హారర్ కామెడీ జోనర్ చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన రావటమే కాదు అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు.

అయితే అది ఎలా అంటే కాస్త వెరీటీగా ప్లాన్‌ చేశారు మేకర్స్‌. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఫిబ్రవరి 24 రాత్రి 7 గంటలకు బేగంపేట స్మశానంలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.హారర్ చిత్రం కావటంతో చిత్ర యూనిట్ టీజర్ లాంచ్‌ను ఇలా ప్లాన్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి వేడుక జరగటం ఇదే తొలిసారి. యువ ప్రతిభను ప్రోత్సహించటంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఎప్పుడూ ముందుంటుంది. నిన్నుకోరి, నిశ్శబ్దం వంటి చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అమెరికాలోని అట్లాంటాకు చెందిన కొరియోగరాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం.

ఇక ఇదిలా ఉంటే కొంతమంది స్మశానంలో టీజర్‌ లాంచ్‌ ఏమిటి అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని కామెంట్లు పెడుతున్నారు. వినడానికి కాస్త హాస్యంగా ఉన్నప్పటికీ పిచ్చి పీక్స్‌ అనే రేంజ్‌ ఈ సినిమా ప్రమోషన్స్‌ జరుగుతున్నాయని కొందరు గుసగుసలాడుతున్నారు. ఎంత హారర్‌ మూవీ అయినప్పటికీ స్మశానంలో లాంఛింగ్‌ ప్రోగ్రామ్‌ ఏమిటి… రేపు సినిమా కూడా అక్కడే ఓ తెర కట్టి ప్రేక్షకులను పిలిచి నిజమైన భయభ్రాంతులు కలిగే ఫీలింగ్‌ కలగజేస్తారా ఏమిటి అన్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత కాలం సినిమా టైటిల్సే వెరైటీ అనుకున్నాం ఇప్పుడు ప్రమోషన్స్‌ కూడా వెరైటీగా చేస్తున్నారు. దీన్ని వెరైటీ అనేకంటే వింత..విడ్ఢూరం అనొచ్చేమో బహుశా!