Mahanaadu-Logo-PNG-Large

దటీజ్ చంద్రబాబు

– మాట నిలబెట్టుకునే నైజం
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా (నందిగామ పట్టణం) : ఎక్కడా మాటతప్పమని చెప్పలేదు.. ఎక్కడా మడం తిప్పమని అనలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలూసులు ఎత్తలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అదే చెప్పారు. ఎక్కడ డొంక తిరుగుడు లేదు. చేసేదే చెబుతానన్నారు. అంతా సూటిగానే చెప్పారు. నాడు చెప్పిందే.. నేడు తన సంతకంతో అక్షరాల నిజం చేసి దటీజ్ నారా చంద్రబాబు నాయుడు అనిపించుకున్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన తొలి ఐదు హామీలపై పంచభూతల సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారన్నారు. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే ఆయన సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేసారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు గారు తొలి సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. ఇక ఫించన్ రూ.4 వేలకు పెంచుతూ అందుకు సంబంధించిన దస్త్రంపై మూడవ సంతకం పెట్టారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టి.. గత జగన్ పాలనలో ధ్వంసమైన ‘అన్నా క్యాంటీన్ల వ్యవస్థ’కు సంబంధించిన పునరుద్దరణ ఫైల్‌పై నాలుగో సంతకం చేశారు. అదే విధంగా యువత నైపుణ్య గణనపై కూటమి నేతలు ఇచ్చిన హామీ నేపథ్యంలో ఆ పైల్‌పై సైతం సీఎం చంద్రబాబు ఐదవ సంతకం చేశారని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.