బాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం

ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఇవాళ ఎన్డీయే నేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.

మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార తీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలు చర్చించారు. అంతేకాదు, కూటమి అభ్యర్థులు పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపై ఈ సమావేశంలో సమీక్షించారు.

బూత్, అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పరిధిలో కూటమి నేతల సమావేశాలు జరపాలని నిర్ణయించారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడు పార్టీలు కలిసి ముందుకు పోయేలా ప్రచార వ్యూహం రూపకల్పనకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ముఖ్యంగా, ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ఎన్డీయే నేతలు చర్చించారు. గోదావరి జిల్లాల్లో కూటమి సభలు విజయవంతం కావడం పట్ల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

కూటమి తరఫున ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. 160కి పైగా అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు సాధించడమే లక్ష్యంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.

ఇక, తాజాగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ అంశం, రాష్ట్రంలో కొందరు ఉన్నతాధికారుల వైఖరి, తదితర అంశాలపైనా కూటమి నేతలు చర్చించారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.