– గాంధీ విగ్రహం ఆవిష్కరణ సభలో ఎమ్మెల్యే యరపతినేని
గురజాల, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల పట్టణంలోగల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన భారత జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని శాసన సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంతి అనే ఆయుధంతో 200 ఏళ్ళ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నేల కూల్చి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని తెలిపారు. ఈరోజు గురజాల పట్టణంలో గాంధీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గర్వకారణంగా ఉందన్నారు. యువత కూడా జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన మార్గంలో నడుచుకుంటూ దేశానికి ఉపయోగపడాలని కోరారు. గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ అప్పులు చేసిందో తెలుసుకోవటానికి కూడా కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని, ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్న ఖజానా ఖాళీగా ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉన్న సమయంలోనే ప్రకృతి విలయితాండవం చేసిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంత ప్రజలందరినీ ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కృషి ఎనలేనిదని ఆయన తెలిపారు.