రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి

– ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
– పాదయాత్రలో మంత్రి లోకేశ్ ఇచ్చిన మరో హామీ అమలు

అమరావతి : యువగళం పాదయాత్రలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.

ఈ నెల 17న వాల్మీకి జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ జయంత్యోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే జయంత్యోత్సవాన్ని అనంతపురంలో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హాజరుకానున్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆదేశిస్తూ అన్ని జిల్లాల బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

యువగళం పాదయాత్రలో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ కు అప్పట్లో పెద్ద సంఖ్యలో వినతులు అందాయి.