ఆమె..చీర కడితే
అజంతా శిల్పం..
పొట్టి పావడా తొడిగితే
పదహారణాల పల్లె పడుచు..
పేంటు..కోటు సింగారిస్తే
ఏయ్..ఘోడా అంటూ
గీర చూపులతో
అదరగొట్టే వాణి..
పైన కొప్పు బిగిస్తే
ఎయిర్ హోస్టెస్..
మురిపాల లత..
పొగరుబోతు సెక్రెటరీ..
కడవెత్తుకొచ్చే కన్నెపిల్ల..
బుల్లి మోటార్ సైలెక్కితే
మనసైన చిన్నది..
రేడియోలో పాడితే
ముందే కూస్తుంది కోయిల..
ఘటం ధరిస్తే మొల్ల..
వయసు మళ్లీనాక
మెగాస్టార్..నాగ్..
బొబ్బిలి రాజాలకు
సరితూగే అత్త..
ఇలా ఎన్నని చెప్తే
పండుతుంది వాణిశ్రీ కథ..
మరపురాని కథ..!
అభినేత్రి..సావిత్రి తర్వాత
అంతటి ప్రియధాత్రి..
ఎన్టీఆర్..ఏయెన్నార్..
కృష్ణ..శోభన్..
ఊపు మీదున్న రోజుల్లో
హీరోయిన్ కి
అసలైన రూపు..
కోర చూపు..
పొగరుబోతు నాయిక..
తెలుగు సినిమా
తిరుగులేని ఏలిక..
అభిసారిక!
సావిత్రి..అంజలి..జమున..
ఈ జమానా ముగుస్తుండగా
జయసుధ..ప్రద..శ్రీదేవి..
హవాకు శ్రీకారం…
ఆ నడుమ వాణిశ్రీ యుగం…
ఆమె పాడిందే రాగం..
వేసిందే గంతు..
గమ్మత్తైన గొంతు..
మహానటి బిరుదు
ఆమె వంతు!
పొగరుబోతు శోభన్ తో
జతకట్టినా
నిజానికి పొగరుబోతు పిల్ల
పాత్రలకు వాణిశ్రీ
పెట్టింది పేరు
ఆత్మగౌరవం ఇంటి పేరు
ఆత్మాభిమానం పాత్ర తీరు…
అన్నట్టు సాగింది నట తేరు..!
లత..రాధ..జయంతి..
ఏ పాత్ర వేసినా
ఇట్టే నచ్చేసే ముద్దబంతి
అదో ప్రేమలోకం..చక్రవాకం..
రాసే కొద్ది
ఇంకా రాయాలన్న మైకం..
వాణిశ్రీ అభినయం..
అసామాన్యం..
అనితరసాధ్యం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286