‘వికటకవి’.. 50 శాతం చిత్రీకరణ పూర్తి

తెలుగు వారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. తాజాగా ఈ టాప్ ఫ్లాట్ ఫామ్ అందించనున్న సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సిరీస్‌ను భారీ చిత్రాలను నిర్మిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం.

హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే గ్రామాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. అలాంటి అమరగిరి గ్రామానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. అంతే కాకుండా ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, అధునిక కుట్రల వెనుకున్న రహస్యాలను అతను వెలికితీస్తాడు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో నీటిమట్టం పెరిగి కొన్ని సత్యాలు కనుమరుగైపోతాయి. దానికి సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియని రహస్యాలుగా మిగిలిపోతాయి. దాన్ని చేధించటానికి డిటెక్టివ్ రామకృష్ణ కాలానికి వ్యతిరేకంగా పోరాడుతాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే.

ఇప్పటి వరకు రూపొందనటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వికటకవి సిరీస్ రూపొందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.