జంధ్యాల .. ఈవీవీ .. శ్రీను వైట్ల తరువాత ఆ స్థాయిలో కామెడీని తెరకెక్కించగల దర్శకుడిగా అనిల్ రావిపూడికి పేరు వచ్చింది. ‘ఎఫ్ 3’ సినిమాతో సక్సెస్ ను అందుకున్న ఆయన, ఆ తరువాత సినిమాను బాలకృష్ణతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.
“ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా అవసరం .. సక్సెస్ వచ్చింది కదా అని ఎంజాయ్ చేయలేం. ఆ తరువాత సినిమా విషయంలో మరింత టెన్షన్ పెరుగుతుంది. వచ్చిన సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి మరింతగా కష్టపడవలసి వస్తుంది. సక్సెస్ లు ఎంతో ఎత్తుకు తీసుకుని వెళతాయి. కానీ పాతాళానికి పడదోయడానికి ఒక్క ఫ్లాప్ చాలు.
ఒకసారి పడిపోయిన తరువాత పైకి తీసుకుని రావడానికి ఇక్కడ ఎవరూ నిచ్చెనలు వేయరు. పడిపోకుండానే చూసుకోవాలి. నా వరకూ నేను అవకాశాలు వచ్చినంత వరకూ దర్శకుడిగా చేస్తాను. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా మారిపోతాను. డైలీ పేమెంట్ తీసుకుని కారవాన్ లో భోజనం చేసి బయటపడొచ్చు” అని చెప్పుకొచ్చాడు.