-సుప్రీం కోర్టు తీర్పుకూ వక్రభాష్యం చెప్పిన వైసీపీ నేతలు
– ఇది వైసీపీ దిగజారుడు రాజకీయం
– టీడీపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
అబద్ధాలు, అసత్య ప్రచారాలే అజెండాగా వైసీపీ నేతలు, మంత్రులు పనిచేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెప్పడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సర్వోన్నత న్యాయం స్థానం ఇచ్చిన తీర్పుకు కూడా మంత్రులు, వైసీపీ నేతలు వక్రభాష్యం చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిపై విషం చిమ్మడం వైసీపీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీం కోర్టు తన జడ్జిమెంట్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి చీఫ్ జస్టిస్ కు నివేదిస్తే దాన్ని కూడా రాజకీయ లబ్దికి వాడుకుంటున్నారు.
సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా అరెస్టు జరిగిన ఈ కేసులో 17 ఎ పై న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే దీన్ని తప్పుదోవ పట్టించేలా, న్యాయ స్థానం తీర్పునూ వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారు. ఈ కేసు పూర్తిగా 17ఎ వర్తిస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి సాగింది. కేసు మూలాలు, ఇతర అంశాలు ఏవీ ఈ తీర్పులో చర్చకు రాలేదు, ప్రస్తావించలేదు.
నీలి మీడియా ద్వారా వైసీపీ చేస్తున్న హడావుడి చూస్తుంటే…తాము దేన్నైనా మార్చి చెప్పగలం అన్నట్లు అధికార పార్టీ పోకడలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన కేసుల్లో ఇప్పటికీ ఒక్క ఆధారం చూపలేదు. చార్జిషీట్లు వేయలేదు. హైకోర్టు బెయిల్ ఉత్వర్వుల్లో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అటు ప్రజలు, ఇటు న్యాయ స్థానాలు నమ్మకపోవడంతో…తమదైన ఫేక్ ప్రచారాలకు వైసీపీ దిగినట్లు అర్థమౌతోంది.
చంద్రబాబు గారిపై పెట్టిన కేసుల్లో నిధుల దుర్వినియోగం అయినట్లు కానీ…ఆ నిధులు వేరే దగ్గరకు చేరినట్లు కానీ ఇప్పటికీ నిరూపించలేక పోయారు. కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు గారి ఇమేజ్ ను దెబ్బతీయాలి…రాజకీయంగా నష్ట పరచాలి అనే ప్రయత్నం తప్ప, అవినీతి లేదని జనం నమ్మారు. రూ. 43 వేల కోట్ల అవినీతిలో కూరుకుపోయి 3,500 వాయిదాలతో రోజులు నెట్టకొస్తున్న జగన్ అండ్ టీం…చంద్రబాబు గారిని దోషిగా చూపే ప్రయత్నం ఎన్నటికీ ఫలించదు. దీనికి వాళ్ల జీవితకాలం కూడా సరిపోదు.