Mahanaadu-Logo-PNG-Large

అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ఎవరున్నారంటే?

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే, నేటితో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు ముగియనుంది. దీంతో ముందుగానే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 60 నియోజకవర్గాలకు గాను 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు, అదేవిధంగా సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది.

సిక్కింలో మొత్తం 146 మంది అభ్యర్ధులు పోటీ చేయగా.. 80శాతం పోలింగ్ నమోదైంది. మరోసారి అధికారాన్ని చేపడతామని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్ కేఎం) ధీమాతో ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 స్థానాలు. ఫలితాల్లో ఎస్ కేఎం భారీ లీడింగ్ లో దూసుకెళ్తుంది.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 60 నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారాన్ని చేపట్టాలంటే 31 సీట్లు కావాలి. ఇప్పటికే బీజేపీ 10 నియోజకవర్గాల్లో ఏకగ్రీవంగా గెలిచింది. ఫలితాల్లో ఆ పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. ఇక్కడ మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి.