Mahanaadu-Logo-PNG-Large

నేడు తీహార్ జైలుకు వెళ్లనున్న ఢిల్లీ సీఎం..!

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలుకు తిరిగి వెళ్లన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత లొంగిపోవాలని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఊరట లభించలేదు.

బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో శనివారం విచారణ జరగగా.. బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఆయన వాస్తవాలను తొక్కిపట్టి, తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై నిర్ణయాన్ని ఈనెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. దీంతో.. సుప్రీం ఆదేశాల మేరకు కేజ్రీవాల్ ఈరోజు జైలు అధికారుల ముందు లొంగిపోనున్నారు. మద్యం కుంభకోణం అంశంలో మనీలాండరింగ్‌ కేసుపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..

కాగా.. ఈరోజు జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుండి బయలుదేరతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని.. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తే, సంతాపం చెందవద్దని కేజ్రీవాల్ బహిరంగ సభలో మాట్లాడారు. పాలసీ ముసాయిదా రూపకల్పనలో.. మద్యం లైసెన్స్‌ల కోసం తిరిగి లంచాలు కోరడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థ అభిప్రాయపడింది. ఆప్కి రూ. 100 కోట్ల ముడుపులు అందాయని తెలిపింది. కాగా.. ఈ ఆరోపణలను కేజ్రీవాల్ ఖండించారు. ఎన్నికలకు ముందు అరెస్టును “రాజకీయ ప్రతీకారం” అని అన్నారు.