Mahanaadu-Logo-PNG-Large

భళా సుజనా!అసాధారణం విజయంతో అన్నీ రికార్డులే…

యలమంచిలి సత్యనారాయణ చౌదరి…అంటే ఎవరో చాలమంది గుర్తు పట్టకపోవచ్చు.. అదే సుజనా చౌదరి అనండి…తెలీని తెలుగువాడుంటాడేమో…కారణమేంటంటే…వ్యక్తిగా తాను ఎంత సైలెంట్ అయినా డీసెంట్ అయినా ఆయన ట్రాక్ రికార్డ్ మాత్రం అంత ఎలాబరేటింగ్ గా ఉంటుంది. అత్యంత సుసంపన్న వ్యాపారి దశ నుంచి… చంద్రబాబు సన్నిహితుడిగా మారి…అలా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి….తొలుత సొంత పార్టీలోనే అసంతృప్తులు ఎదుర్కొని…ఆనక అందరికీ ఆప్తుడుగా మారి…ఏకంగా కేంద్ర మంత్రిగా ఢిల్లీలో పాగా వేసి…అనంతరం మారిన పొలిటికల్ పరిణామాలతో పార్టీ మారి…నేరుగా బిజెపిలో చేరి…అక్కడా అవకాశం కోసం ఎదురు చూసి…ఆ తరువాత మళ్లీ రాష్ట్రానికి వచ్చి…ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి…ఇక్కడా అద్భుత విజయం సాధించి మళ్లీ మరో అందలమెక్కేందుకు సిద్దంగా ఉన్న అసాధారణ పొలిటీషియన్…ఈ రోజు ఆయనే మన కథానాయకుడు…ఎందుకు సజనా చౌదరి గురించి ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సివస్తుందంటే ఆగర్భ శ్రీమంతుడిగా తనకు సూటయ్యే క్లాస్ పాలిటిక్స్ ఉండే పార్లమెంట్ రాజకీయాల నుంచి ఒక్కసారిగా…ఉన్నట్టుండి…ఊర మాస్ లాగా ఉండే అసెంబ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిరావడం సుజనాకే కాదు మరే పొలిటీషియన్ కైనా మింగుడు పడటం చాలా కష్టం. అయినా రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలనే నానుడిని అర్ధం చేసుకున్నట్లుగా పరిస్థితులకు తగినట్లుగా తక్షణమే మారిపోయి ఆ వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని…దాన్ని అతి చక్కగా అమలు చేసి అసాధారణ విజయంతో ఔరా అనిపించాడీ పెద్దమనిషి…సుజనా నిజంగా పెద్దమనిషే…వ్యవహార రీత్యానే కాదు…వ్యవస్థాపరంగానూ గతంలో ఈయన పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి…

ఇక ఇప్పుడు అసలు విషయానికొస్తే…కారణాలు ఏమైనా శ్రీమాన్ సుజనా చౌదరి గారు ఈ సారి ఎన్నికల్లో ఎంపి పదవికి కాకుండా ఎమ్మెల్యేగా పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అవకాశాలను అందిపుచ్చుకునే విజయవంతమైన వ్యాపారిగా ఈ అవకాశాన్ని ఆయన వదులుకోదలుచుకోలేదు. అందుకే తనకు కేటాయించిన విజయవాడ వెస్ట్ బరిలో దిగారు.సమీకరణాల పరంగా చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది సుజనాకు ఏమాత్రం అనుకూలమైన సీటు కానేకాదు. కారణం ఈ నియోజకవర్గంలో మైనార్టీలు చాలా ఎక్కువ. ఆయన పోటీ చేసేదేమో హిందూ మతత్వ పార్టీగా ముద్ర ఉన్న బిజెపి నుంచి…కనీసం తన పాత పార్టీ అయిన టిడిపి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న అది మరోలా ఉండేది. ఇక్కడ సుమారుగా రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో యాభై వేలమంది ముస్లిం ఓటర్లు.ఇలా మైనార్టీలు ఎక్కువగా ఉండి వారు గ‌ట్టిగా వ్య‌తిరేకించే బిజేపీ నుంచి సుజనా చౌదరి ఇక్కడ పోటీకి దిగడం అందర్నీ చాలా ఆశ్చర్యపరిచింది. పైగా ఆయనకు ప్రత్యర్థిగా గత ఎన్నికలలో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కాదని…ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్, విద్యాసంస్థల అధినేత షేక్ ఆసిఫ్ ను రంగంలోకి దింపారు.పైగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సామాజిక సమీకరణాల పరంగా వైసీపీకి బాగా అనుకూలంగా ఉన్న నియోజకవర్గం…అందుకు నిదర్శనం వైసీపీ గత రెండు ఎన్నికలలోను ఇక్కడ నుంచి విజయం సాధించింది.

సరే..సుజనా పని మొదలుపెట్టారు. ముందు సుజనా చౌదరి ముస్లింల మనసు గెల్చుకునే ప్రయత్నం చేశారు. ముస్లింలకు తాను ఏం మేలు చేస్తాడు… అది మాటల్లో కాకుండా చేతల్లో ఎలా చేసి చూపిస్తాడో వాళ్ల పెద్దలతో మమేకమై మాట్లాడి మెప్పించారు. అలాగే ఇతర బీసీ సామాజిక వర్గాలు,ఆర్య వైశ్యులతో పాటు ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఉన్న మార్వాడీలు,జైనులు,ఉత్తర భారతీయులు వీళ్లందరినీ ఇక్కడ ఏకతాటి మీదకు చేర్చి అందుకు అవసరమైన అంగ బలం, అర్ధ బలాన్ని సమకూర్చి పక్కా పథకం ప్రకారమే ముందుకు వెళ్లారు. అలా తాము ఖచ్చితంగా గెలిచే సీటు అనుకున్న వైసీపీని కి పోలింగ్ కి ముందే టగ్ ఆఫ్ వార్ అనే స్థాయికి తెచ్చి ముచ్చెమటలు పోయించారు. దీంతో గెలుపు మాదే అనే వైసిపి ధీమా ఎగ్జిట్ పోల్స్ నాటికే ఏమవుతుందో అనే భయం నెలకునేలా చేశారు. ఆ తరువాత ఫలితాలు వచ్చాయి. ఆ తరువాత జరిగిదంతా ఇక చరిత్రే…

గెలిస్తే చాలు అనుకున్న సుజనా చౌదరి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ…ఆనందడోలికల్లో తేలియాడిస్తూ తకము క్లిష్టమైన ఈ నియోజకవర్గంలో ఏకంగా 46,540 ఓట్ల భారీ మెజార్టీతో అద్భుత విజయం సాధించారు. అస‌లు పార్టీ గెలుపుకే అవకాశం లేని చోట బిజెపి నుంచి పోటీ చేసి ఈ రేంజ్‌లో విజ‌యం సాధించ‌డాన్ని చూసి ఇప్పుడు అందరూ ఒకటే అంటున్నారు…సుజ‌నా చౌదరి మామూలోడు కాదని!…సో ఇంతటి అసాధారణ విజయం సాధించిన సుజనా చౌదరి ఇప్పుడు ఇంకో అందలాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనేది పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్…అదే…బీజేపీ కోటా నుంచి ఎపి మంత్రి పోస్ట్ సాధించనున్నారనేదే ఆ టాక్…సో ఇంతటి కార్యసాధకుడికి ఎవరైనా ఏమి చెప్పగలరు…ఆల్ ద బెస్ట్ తప్ప…సుజనా సర్..అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం!