అసాధారణ ప్రజ్ఞాశాలికి…అపూర్వ విజయం

ఆ పెద్దింటి యువకుడికి సమాజ సేవంటే ప్రాణం…అది విస్తృత స్థాయిలో జరగాలంటే ప్రజాప్రతినిధిగా మారడమే సరైన పరిష్కారంగా భావించాడు. అందుకు తాత నుంచి వచ్చిన వారసత్వం తోడయింది. అన్నిటికీ మించి తనకిష్టమైన పార్టీతో అతిదగ్గరి బంధుత్వమూ ఉంది. దీంతో అనుకున్నదే తడవుగా సీటు సాధించాడు…స్థాన బలం ఉన్న చోటే పోటీ చేశాడు. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్…తానొకటి తలిస్తే విధి మరోలా తలచింది…ఫలితం 5000 వేల ఓట్ల తేడాతో ఓటమి…ఆ తరువాత కాలం గిర్రున తిరిగింది. ఐదేళ్లు గడిచి పోయాయి. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు మళ్లీ అదే ప్లేస్ లో పోటీ చేశాడు..ఈసారి బలమైన ప్రత్యర్థిని సైతం చిత్తు చిత్తుగా ఓడించి అత్యంత భారీ మెజారిటీతో 5 లక్షల పై చిలుకు ఓట్ల తేడాతో గెలిచాడు…ట్విస్ట్ ఏమిటంటే ఈ సారి అతనికి మెజారిటీ వచ్చినన్ని ఓట్లు కూడా ప్రత్యర్థికి రాకపోవడం…ఇదే కదా…దేవుడి స్క్రిప్ట్ అంటే?…ఇంతకీ ఎవరా యువకుడు…ఏమా కథ…తెలుసుకుందాం పదండి!

యువత రాజకీయాలకు దూరంగా ఉంటుందనేది మన దేశంలో మేధావులు తరుచూ చేసే విమర్శ. అయితే యువత తల్చుకోవాలే కానీ ఎడ్యుకేషన్, బిజినెస్ ల్లోనే కాదు రాజకీయాలను సైతం శాసిస్తారనడానికి ఈ యువకుడే చక్కటి ఉదాహరణ. ఇతడి గెలుపు వైనం తెలిస్తే సామాజిక బాధ్యత గురించి నేటి తరాన్ని నిలదీసే కుహనా మేధావుల నోటికి తాళం వేసుకోవాల్సిందే. కారణం ఈ యువకుడి ఐదేళ్ల రాజకీయ ప్రస్థానంలోనే ఓటమి,గెలుపు, విలువలు, సామాజిక బాధ్యత ఇలా వాట్ నాట్ అన్నట్లు అన్ని కోణాలున్నాయి. ఆ యువకుడు మరెవరో కాదు…తాజా ఎన్నికల్లో విశాఖ టిడిపి కూటమి ఎంపీగా విజయ దుందుభి మోగించిన శ్రీ భరత్.

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడిగా తెలుగు వారందరికీ సుపరిచితుడైన శ్రీ భరత్ విశాఖలో గీతం యూనివర్సిటీ వారసుడిగా అక్కడి ప్రజలకు చిరపరిచితుడు. మంచి అకడమీషియన్ అయిన శ్రీ భరత్ అమెరికాలోని పర్థూ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదివి ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లో విద్యారంగంపై మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం కుటుంబ వ్యాపారాల నిర్వహణా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా విద్యుత్తు ఉత్పాదన రంగానికి చెందిన తమ పరిశ్రమలను విజయవంతంగా నడిపించడం ద్వారా సక్సెస్ ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు. అదే క్రమంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో అనేక స్టార్టప్ పరిశ్రమలను ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా అనేక పారిశ్రామిక సదస్సులలో శ్రీ భరత్ చేసిన ప్రసంగాలు జాతీయ స్థాయి నిపుణుల మన్ననలు పొందాయి.

వ్యాపార రీత్యా ప్రపంచంలోని వివిధ దేశాలలో విస్తృత పర్యటనలు జరిపే శ్రీ భరత్ తన సహజసిద్ధ అవగాహనా నైపుణ్యంతో ప్రపంచ భౌగోళిక,సామాజిక,వాణిజ్య,రాజకీయాలపై మంచి పట్టు సాధించారు. అనంతరం హైదరాబాద్ కేంద్రంగా కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అనే నాలెడ్జ్ సెంటర్ ను నెలకొల్పారు. ఒక యువకుడు ఈ తరహా ఆలోచన చెయ్యడం, ఏకంగా ఇలాంటి సంస్థ నెలకొల్పడం అతని లోని ప్రత్యేకతను చాటిచెబుతోంది. ఈ సెంటర్ లో జరిగే చర్చల్లో ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన నిపుణులు, వివిధ దేశాలలో భారత రాయబారులుగా సేవలందించిన వారు,ఆర్బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వంటి మేధావులు, వరల్డ్ బ్యాంక్ నిపుణులు, పార్లమెంట్ సభ్యులు,రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు పాల్గొనేవారు. ఈ స్థాయి దిగ్గజాలతో శ్రీ భరత్ సామాజిక వికాసమే ప్రధానాంశంగా ఈ చర్చల్లో పాల్గొని తన మేధస్సుతో వారిని మెప్పించగలగడం అతనిలోని అసాధారణ ప్రజ్క్షకు అద్దం పడుతోంది.ఇవన్నీ చేస్తూనే మరోపక్క తమ మానస పుత్రిక గీతం విద్యాసంస్థలకు సంబంధించిన విశాఖ, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్ ల అధ్యాపక సిబ్బంది, వేలాది మంది విద్యార్థులు, విదేశాలలోని పూర్వవిద్యార్థులతో జూమ్ మీటింగ్ ల ద్వారా మమేకమవుతూ దిశానిర్ధేశం చేస్తుంటారు. తాను ఎంత బిజీగా ఉన్నా గీతం రోజువారీ పర్యవేక్షణ అనేది అతనిలోని అంకితభావానికి నిదర్శనం.

ఈ నేపథ్యంలో 2019లో 29 సంవత్సరాల వయస్సులో రాజకీయ రంగ ప్రవేశం చేసి విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీచేసిన శ్రీ భరత్ 5 వేల స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు.అయితే ఆ ఓటమితో కాడిని కింద పడేయకుండా ఇకపై విశాఖ వాసులందరి సంక్షేమం తన బాధ్యత అనుకున్నారు. ఆ క్రమంలో కోవిడ్ 19 రాకతో దేశమే అతలాకుతలమైతే తమ వంతు బాధ్యతగా విశాఖ గీతం యూనివర్శిటీ హాస్టల్స్ ను వైద్య చికిత్సా కేంద్రాలుగా మార్చారు. వైద్య సేవల్లో వైట్ రేషన్ కార్డు ఉన్న పేద ప్రజానీకానికే తొలి ప్రాధాన్యత ఇవ్యాలని శ్రీ భరత్ తీసుకున్న ఒక్క నిర్ణయం చాలు అతనిలోని మానవీయకోణం ఎత్తెంతో అద్దం పట్టడానికి..ఈ చర్యతో కార్పోరేట్ ఆసుపత్రులలో ప్రవేశానికి అవకాశమే లేని దాదాపు 5000 మంది పేదలు గీతంలో కోవిడ్ చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కోవిడ్ తరువాత కూడా వైద్యసేవల కోసం ప్రజా విజ్జప్తులు వెల్లువెత్తడంతో ఈనాటికీ విశాఖ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఎల్.జి.పాలిమర్స్ ప్రమాదం సమయంలోను ప్రజలకు వైద్యంతో పాటు అవసరమైన అన్నిరకాల సహాయసహకారాలు అందచేశారు.

ఇవన్నీ ఇక ఎత్తయితే విశాఖ మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో శ్రీ భరత్ కంట్రిబ్యూషన్ కొనియాడదగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ను వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటానికి మద్దతుగా తాను స్వయంగా నిరాహర దీక్షలలో పాలుపంచుకున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన నౌకాదళ సిబ్బంది పిల్లలకు నామమాత్రపు ఫీజుతో గీతం విద్యాసంస్థలలో చదివే అవకాశం కల్పించారు.విశాఖ అగ్నిమాపక కేంద్రం అబివృద్ది కోసం 50 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం… ఇవన్నీ ఆయనలోని మానవతావాది గొప్పతనాన్ని ప్రతిబింబింప చేస్తాయి. చేతినిండా డబ్బు…మది నిండా కోరికలతో జీవితాన్ని ఆస్వాదించాలనే యుక్తవయస్సులో…ఇతడు మాత్రం భిన్నంగా రాజకీయ నాయకుడిగా మారాడు. ఈ క్రమం లో మారుమూల గ్రామాల సమస్యల నుంచి విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమం ప్రాముఖ్యత వరకు అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ గడచిన నాలుగేళ్ళలో శ్రీ భరత్ ఎదిగిన తీరు ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది.

ఇక రాజకీయ నేతగా శ్రీ భరత్ ప్రయాణం విషయానికొస్తే ఏ పొలిటీషియన్ మీదైనా రాజకీయంగానే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయకూడదనే నియమానికి కట్టుబడి ఉన్నాడు.మరోవైపు వివాదాలకు తావులేకుండా డైలాగ్ విత్ భరత్ పేరిట విశాఖ సమస్యల మీద ఒక చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే స్థాయీ బేధాలు లేకుండా విశాఖ పార్లమెంట్ నియోజక వర్గంలో ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా తప్పనిసరిగా హజరవడం అతని కమిట్ మెంట్ కు నిదర్శనం.

అయితే ఇదంతా ఒక వైపయితే నాణానికి మరోవైపు రాజకీయ రంగప్రవేశంతో శ్రీ భరత్ ఎదుర్కొన్న ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. 2019 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన శ్రీ భరత్ ఆ తరువాత ఏర్పడిన వైసిపి ప్రభుత్వ హయాంలో అనేక వేధింపులు,బెదిరింపులు ఎదుర్కొన్నారు. పైగా ఆర్ధిక రాజధాని అంటూ సిఎం జగన్ సైతం విశాఖనే కేంద్రంగా చేసుకొని వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకొని అనేక రకాల ఇబ్బందులు పెట్టినా వాటన్నింటిని తట్టుకుంటూ విశాఖలో తన రాజకీయ యాత్రను అప్రతిహతంగా కొనసాగించారు. పార్టీ నేతలను కాపాడుకున్నారు.కూటమిగా మారాక మూడు పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడా అనైక్యత తలెత్తకుండా ఏకతాటిగా నడిపి తన రాజకీయ చతురతతో అనుభవశాలురను సైతం ఆశ్చర్యపరిచారు.

 

వీటిన్నింటి ఫలితం తాజా 2024 ఎన్నికల్లో శ్రీ భరత్ విశాఖ ఎంపీగా కనీవినీ ఎరుగని అఖండ విజయం ద్వారా కనిపించింది. మే నెల నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 72 శాశం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4 న జరిగిన కౌంటింగ్ లో 13,583 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 8,93,884 ఈవియం ఓట్లు లభించాయి. అధికార దుర్వినియోగంతో సహా అన్ని వ్యవస్థలను వాడుకుంటూ భరత్ పై పోటీచేసిన మంత్రి బొత్సా సత్యనారాయణ సతీమణి బొత్సా ఝాన్సీకి 5,399 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4,03,220 ఈవియం ఓట్లు మాత్రమే వచ్చాయి. వెరసి శ్రీభరత్ కి మొత్తంగా 9,07,467 ఓట్లు రాగా బొత్సా ఝాన్సీకి 4,03,220 ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో శ్రీభరత్ 5,04,247 ఓట్ల భారీ మెజార్టీ తో రికార్డు గెలుపు పొంత చేసుకున్నారు. విశాఖ రాజకీయ చరిత్రలో దివంగత ఎంవీవీఎస్ మూర్తికి మించిన మెజార్టీని సాధించి శ్రీభరత్ తాతను మించిన మనవడుగా చరిత్రకెక్కాడు.అందుకే ఇతడి విజయం యువతకు స్ఫూర్తిదాయంకం…మార్గదర్శకం…అందుకే శ్రీ భరత్ గురించి ఒక్కమాట తప్పక చెప్పాలి…నీలాంటి వాళ్లే ఈ దేశానికి కావాలి…కీపిటప్ శ్రీ భరత్…

( B S R )