Mahanaadu-Logo-PNG-Large

ఇంకా.. ‘జగన్నా’మమే!

– ఎన్టీఆర్ హెల్త్‌వర్శిటీ పేరు మార్చిన జగన్ సర్కారు
– ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు
– దానిని సమర్థించిన లక్ష్మీపార్వతి
– కూటమి వచ్చిన తర్వాత మళ్లీ ఎన్టీఆర్ పేరు
– అయినా పత్రిక ప్రకటనలో వైఎస్సార్ పేరు
– రాధికారెడ్డి గారి జగనాభిమానం
– నల్లపాడు సర్కారు ఆసుపత్రికీ ఇంకా వైఎస్ పేరు
– అధికారులకు ఇంకా తగ్గని జగన్బక్తి
– ఏం జరుగుతోందంటూ విరుచుకుపడుతున్న టీడీపీ సోషల్‌మీడియా సైన్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రభుత్వం మారింది. ఈ 45 రోజుల్లో కూటమి సర్కారు అనేక నిర్ణయాలు తీసుకుంది. సరే.. వాటిలో కొన్ని తెలిసి, మరికొన్ని తెలలియక తీసుకున్న నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా చక్రం తిప్పేది ఐఏఎస్ అధికారులే కాబట్టి.. పాలకులు మారినప్పటికీ, వారికున్న ‘ఆర్ట్‌ఆఫ్ లివింగ్’తో మళ్లీ చంద్రబాబు సర్కారురులో అడ్డా వేశారు. అసలు జగన్ పార్టీకి లీగల్ సలహాలిచ్చిన నాయకురాలి కుటుంబమే, సీఎంఓలో మళ్లీ అడ్డా వేసిందన్న సోషల్‌మీడియా చిటపటలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. అది వేరే విషయం.

సరే అంతవరకూ బాగానే ఉంది. ఐదేళ్లు జగన్నామస్మరణతో ఓవరాక్షన్ చేసిన కొందరు అధికారులకు, ఇంకా జగనాభిమానం మనసులో ఉండటమే విమర్శలకు దారితీస్తోంది. స్వయంగా టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరుమీద స్ధాపించిన ఎన్టీఆర్ యూనివర్శిటీ విషయంలోనే, అధికారులు జగన్భక్తి చూపించారంటే.. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? వారి ధైర్యం ఏమిటి? ఏం చేసినా పాలకుల చుట్టూ చేరిన గాడ్‌ఫాదర్లు ర క్షిస్తారన్న ధీమానా? ఇప్పుడు సోషల్‌మీడియాలో ఇదే హాట్‌టాపిక్.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ. ఇది ఏపీలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో ఒకటి. చంద్రబాబునాయుడు హయాంలో దానికోసం చాలా కృషి జరిగింది. రైతులు కూడా దానికి తమ పొలాలు దానం చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత పేరు మార్చి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు తగిలించారు. అది కాస్తా వివాదమయింది. కృష్ణా జిల్లా ప్రజలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యావంతులు భగ్గుమన్నారు. కారణం దానిని ఆత్మగౌరవంగా భావించడమే. కానీ ఎన్టీఆర్ ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి మాత్రం ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. వైఎస్ పేరు పెడితే తప్పేమిటన్నారు. సరే.. అప్పట్లో ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు మార్పించి, జగనన్న పెదవులపై చిరునువ్వులు పూయించిన అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారి, మళ్లీ ఇప్పటి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఎగబాకారు. అది వేరే కథ.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..దానిని ‘ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మార్చింది. ఆమేరకు క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది. అయితే.. సదరు యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా ఉన్న రాధికారెడ్డి మాత్రం.. తాజాగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనలో ఇంకా దానిని డాక్టర్ వైఎస్సార్ హెల్త్‌యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పేర్కొనడం విస్మయపరిచింది. ఎండీఎస్ మేనేజ్‌మెంట్-కాంపిటేట్ అథారిటీ కోటా పేరుతో పత్రికలకు ఇచ్చిన ప్రకటన అది.

అయితే ఆ యూనివర్శిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టారన్న స్పృహ, దానికి క్యాబినెట్ ఆమోదం కూడా లభించిందన్న విషయం కూడా తెలియకుండా రాధికారెడ్డి రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారని తేలిపోయింది. అదీకాకపోతే.. వైఎస్సార్ పేరు తొలగించడం ఇష్టం లేక, ఆయన తనయుడిపై ఉన్న జగనాభిమానంతో ఆ పేరును తొలగించడం మనస్కరించకపోయినా ఉండాలి.

ఈ విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. టీడీపీ సోషల్‌మీడియా సైన్యం, రాధికారెడ్డి ‘జగనాభి’మానాన్ని తెగ విమర్శిస్తోంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మన పార్టీనే అధికారంలో ఉందా? ఇంకా జగనే సీఎంగా ఉన్నారా? ఎలాంటి అధికారులను నియమిస్తున్నారు? నిజమైన నివేదికలివ్వకుండా నిఘా నిద్ర పోతోందా? అంటూ విమర్శల వర్షం కురిపిస్తోంది.

ఒకవైపు ఈ విమర్శల వర్షం కురుస్తున్న సమయంలోనే.. గుంటూరు నల్లపాడు ప్రభుత్వ ఆసుపత్రికి, ఇంకా వైఎస్సార్ పేరు ఉన్న ఫొటోను పెట్టిన టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, ఆ ఫొటోపై కామెంట్లు పెట్టి మరీ అధికారుల నిర్లక్ష్యాన్ని ఉతికిఆరేస్తున్నారు. సో.. టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, ఎన్నికల ముందు కంటే ఇప్పుడే బాగా చురుకుగా పనిచేస్తున్నారన్నమాట!