చంద్రబాబు ప్రమాణానికి వెళ్లనున్న రేవంత్!

ఆంధ్రప్రదేశ్ లో అపూర్వ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా చంద్రబాబుకు రేవంత్ గురువారం ఫోన్ చేసి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకు సేందుకు సహకరించాలని కోరారు. కాగా ఈనెల 12న అమరావతిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరు కావాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళతానని రేవంత్ బుధవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించారు. రేవంత్ తో పాటు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో పని చేసిన తెలంగాణ మంత్రులు, అప్పట్లో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.