– తప్పుడు ప్రకటనలు, వాగ్దానాలతో విద్యార్థులను మోసం చేయడంపై మండిపాటు
– విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దంటూ హెచ్చరిక
అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరించినందుకు బైజూస్ సంస్థకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ రూ.1.33 లక్షలు జరిమానా విధించారు. తప్పుడు ప్రకటనలు, వాగ్దానాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ హెచ్చరించారు. నెల్లూరు పట్టణానికి చెందిన నిస్సి జమీ కిరణ్ అనే విద్యార్థిని గత ఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి.. బైజూస్ లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా నీట్ పరీక్షకు సన్నద్దమవ్వాలని నిర్ణయించుకుంది. కోర్సు మొదలైన వెంటనే మెటీరియల్, టాబ్లెట్ ను కూడా అందిస్తామని బైజూస్ ప్రతినిధులు వాగ్దానాలు చేశారు.
తరగతులు సంతృప్తికరంగా లేకుంటే కోర్సు రద్దు చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ ఫీజు వాపసు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు 2023 జూన్ 11 న రూ.15 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన తర్వాత సరైన శిక్షణ లేకపోవడం, సంబంధిత మెటీరియల్, టాబ్లెట్ అందకపోవడంతో 2023 జూన్ 18న అడ్మిషన్ ఉప సంహరించుకున్నట్టు బైజూస్ సంస్థకు విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.15 వేలు విద్యార్థి తల్లి ఖాతాలో జమచేస్తామని బైజూస్ సంస్థ ప్రతినిధి తెలియజేసి.. మోసం చేశారు. కాగా విద్యార్థిని తల్లి పవిత్ర ఖాతా నుండి ఆటోమాటిక్-డెబిట్ ద్వారా మిగిలిన కోర్సు రుసుం రూ.83,004 లు నెలవారీ ఇన్స్టాల్మెంట్స్ కింద బైజూస్ సంస్థ వసూలు చేసింది.
అడ్మిషన్ ఉపసంహరించుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్, కోర్సు ఫీజు మొత్తం రూ.98,004లు బైజూస్ సంస్థ వసూలు చేసింది. దీంతో బాధితులు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ సాక్ష్యాలను పరిశీలించి తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.1.33 లక్షలు (ఫీజు కింద వసూలు చేసిన రూ.98,004లతో పాటు మానసిక ఆవేదనకు రూ.30 వేలు, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు) తీర్పు వెలువరిని 45 రోజుల్లోగా చెల్లించాలని బైజూస్ సంస్థను ఆదేశించారు.